మహా నగరం సరికొత్త చరిత్రకు వేదికైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకమండలి ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. పదేండ్ల తర్వాత మళ్లీ ప్రత్యేక అధికారి పాలనలోకి అడుగుపెట్టింది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం పెరగడం, 27 మున్సిపాలిటీల విలీనం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న మూడు కార్పొరేషన్ల చారిత్రాత్మక నిర్ణయాలతో మహా నగర పాలన పూర్తిగా మారిపోనుంది. బుధవారం స్పెషల్ సీఎస్ స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడంతో పాటు మూడు కార్పొరేషన్లకు సంబంధించి గెజిట్‌ను ప్రభుత్వం వెలువరించనున్నట్లు తెలిసింది.ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న జయేశ్ రంజన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. స్పెషలాఫీసర్ హయాంలోనే జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్ల విభజనతో పాటు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ, పాలక మండలి కొలువుదీరే వరకు స్పెషలాఫీసర్ పాలన కొనసాగనున్నట్లు ఉన్నతాధికార వర్గాల సమాచారం. -సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ)
మహా నగర జనాభా దాదాపు 1.34 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో ప్రజలకు పౌర సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించే దిశగా కసరత్తు పూర్తి చేసింది. ప్రతిపాదిత విభజన స్వరూపాన్ని పరిశీలిస్తే జీహెచ్ఎంసీ (హైదరాబాద్) పాత నగరంతో పాటు ప్రధాన నగర ప్రాంతాల్లోని 6 జోన్లు దీని పరిధిలోకి రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోలొండ, శంషాబాద్, రాజేంద్రనగర్‌లను కలుపుకుని జీహెచ్ఎంసీగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్ల్లాపూర్ జోన్లు కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడే అవకాశం ఉంది. మలాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో మల్కాజిగిరి లేదా లష్కర్ కార్పొరేషన్‌గా ఏర్పాటయ్యే సూచనలు ఉన్నాయి.
ముగిసిన మేయర్, కార్పొరేటర్ల పాలన..
2021 ఫిబ్రవరి 11న కొలువుదీరిన ప్రస్తుత పాలక మండలి గడువు మంగళవారం అర్దరాత్రికి పూర్తిగా ముగిసింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు 150 మంది కార్పొరేటర్లు మాజీలయ్యారు. వార్డుల్లో ఇకపై ప్రజాప్రతినిధుల సిఫార్సుల కంటే అధికారుల ఆదేశాలే కీలకం కానున్నాయి. కొత్తగా ఎన్నికలు జరిగి, కొత్త కౌన్సిల్ ఏర్పడే వరకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి సర్వాధికారిగా వ్యవహరిస్తారు. కాగా వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీ వంటి సాంకేతిక ప్రక్రియల కారణంగా తదుపరి ఎన్నికలకు మరో ఆరు నెలల నుంచి ఏడాది కాలం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అప్పటి వరకు నగర మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, బడ్జెట్ ఆమోదం వంటి కీలక అంశాలను ప్రత్యేకాధికారే పర్యవేక్షిస్తారు. ఐతే జీహెచ్ఎంసీకి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారన్న వాదనలు తెరపైకి వచ్చిన, ఇటీవలే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని 27 పురపాలికల విలీనంతో పెరిగిన పరిధిని 300 వార్డులుగా, 60 సర్కిల్స్, 12 జోన్లుగా పునర్విభజించిన సంగతి తెలిసిందే.