వినాయకనగర్, ఆగస్టు 16: పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతంగా నిర్వహించాలని, చిన్నారుల భద్రత, గోప్యతలకు ప్రాధాన్యతనివ్వాలని సీపీ సాయిచైతన్య సూచించారు. పోక్సో కేసుల్లో నిందితులను త్వరగా పట్టుకుని కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసుల దర్యాప్తు, కేసుల పురోగతిపై ఆదివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీపీ సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన చిన్నారులపై లైంగిక దాడులు, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు ఒక్కొక్కటిగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా కేసుల్లో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, నిందితుల గుర్తింపు, అరెస్టులు, సేకరించిన ఆధారాలు, సాక్షుల వివరాలు, బాధిత చిన్నారుల వాంగ్మూలాలు, కేసుల ప్రస్తుత స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో దర్యాప్తు ఏ దశలో ఉన్నదనే విషయాన్ని క్షుణ్ణంగా సమీక్షించి పెండింగ్‌లోని అంశాలను గుర్తించారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాల విషయంలో పోలీసు శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నదని, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా వేగవంతమైన శాస్త్రీయ, నాణ్యమైన దర్యాప్తు చేపట్టడమే లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు. సమావేశంలో డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాశ్‌యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, మల్లేశం, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, సీఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.