న్యూఢిల్లీ : రైల్వేశాఖ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పారిశుధ్యంపై భారత కంప్ట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్(కాగ్) చేపట్టిన ఆడిట్లో పలు లోపాలు బహిర్గమయ్యాయి. మొత్తం 512 స్టేషన్లలో కాగ్ తనిఖీలు చేయగా, 89 శాతానికిపైగా స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, వాటర్ కూలర్లు, సూచిక బోర్డులు సహా, పలు కనీస సౌకర్యాలలో లోపాలు ఉన్నట్లు తేలింది. నిధుల కొరత లేనప్పటికీ 2019-20 నుంచి 2023-24 వరకు బడ్జెట్ గ్రాంట్ల వినియోగం 36 శాతం నుంచి 44 శాతం మధ్య నిలిచిపోయిందని, ఇది ఆర్థికపరమైన పరిమితుల కంటే ప్రణాళిక, అమలులో లోపాలను నొక్కి చెబుతున్నదని నివేదిక పేర్కొంది.
ఈ నివేదికను గతవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆడిట్ చేసిన 512 స్టేషన్లలో 458 స్టేషన్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కనీస అవసరమైన సౌకర్యాలు లోపించినట్టు నివేదిక వెల్లడించింది. నిధుల కొరత లేనప్పటికీ ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు కేటాయించిన బడ్జెట్ గ్రాంట్ల వినియోగం నిరంతరం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.