మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వాటిల్లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు అశ్వారావుపేట, ఇల్లెందు, ఏదులాపురం, మధిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లను ఆయా జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి పాటిల్, అనుదీప్ పర్యవేక్షించారు.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 10
కొత్తగూడెం కార్పొరేషన్లో 201 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజీలో పంపిణీ కేంద్రం ద్వారా మెటీరియల్‌ను తరలించారు. 60 డివిజన్లలో ఓటింగ్ ప్రక్రియ జరగనున్నందున ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు సిబ్బందిని నియమించారు. వారికి మెటీరియల్‌ను అందజేశారు. పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, నోడల్ అధికారులు రూట్ అధికారుల సమక్షంలో మెటీరియల్‌ను పంపిణీ చేశారు. కొత్తగూడెంలో 201 పోలింగ్ కేంద్రాలకుగాను 201 మంది పీవోలు, 402 మంది ఏపీవోలు, 402 ఓపీవోలతోపాటు అదనంగా సిబ్బందిని కూడా సహాయకులుగా నియమించారు. వీరితోపాటు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరు పోలీసు సిబ్బందిని కూడా నియమించారు.భద్రాద్రి అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు మెటీరియల్ పంపిణీ కేంద్రాలను సందర్శించి పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు.
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు..
ఈ మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలను బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం నిర్వహించాయి. ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 117 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పారదర్శకత కోసం వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటుచేసిన ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ప్రతి వార్డులోనూ త్రిముఖ పోటీ జరుగనుంది. ప్రచార సరళిని బట్టి మెజారిటీ మున్సిపాలిటీలను తామే గెలుచుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ భరోసాతో ఉంది. 215 పోలింగ్ అధికారులు, ఏపీవోలు విధులు నిర్వహించనున్నారు. 26 మంది జోనల్ అధికారులు, 38 మంది రూట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం పోలింగ్ పూర్తికాగానే బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములకు భారీ భద్రత నడుమ తరలించనున్నారు. కౌంటింగ్ కేంద్రాలను ఆయా మున్సిపాలిటీల పరిధిలోనే ఏర్పాటు చేశారు.

‘భద్రాద్రి’లో ఏర్పాట్లు పూర్తి
భద్రాద్రి జిల్లాలో బుధవారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 106 వార్డుల్లో 1,85,346 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 345 మంది ప్రిసైడింగ్ అధికారులను; 1,036 మంది ఇతర పోలింగ్ అధికారులను నియమించినట్లు వివరించారు. అదే విధంగా 48 మంది రిటర్నింగ్ అధికారులు, 48 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించామన్నారు. కౌంటింగ్ సిబ్బందిని ముందుగానే గుర్తించి అవసరమైన శిక్షణ అందించినట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.
సత్తుపల్లి పంపిణీ కేంద్రం సందర్శన
అధికారులకు పలు సూచనలు చేసిన ఖమ్మం కలెక్టర్ అనుదీప్
సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 10: సత్తుపల్లిలోని జ్యోతి నిలయం పాఠశాలలో ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్ అనుదీప్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కలిసి మంగళవారం సందర్శించారు. ఎన్నికల మెటీరియల్ కలెక్షన్ పాయింట్, కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూములను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 23 వార్డులకు గాను 48 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. జ్యోతి నిలయం పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఈ నెల 13న ఓట్ల లెకింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధులకు ముగ్గురు ఏసీపీలు, ముగ్గురు సీఐలతోపాటు 12 మంది ఎస్సైలు, 200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి
పోలీసు బందోబస్తుతో సామగ్రిని తరలించాలి: భద్రాద్రి కలెక్టర్
ఇల్లెందు, ఫిబ్రవరి 10: ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లెందులోని సింగరేణి పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలు సజావుగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ పేపర్లను తరలించే సమయంలో పోలీసు బందోబస్తు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎస్పీ వెంకన్నబాబు, మున్సిపల్ కమిషనర్ గణేష్, మేనేజర్ అంకుషావలి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో ధన్సింగ్, సీఐ టి.సురేష్, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.