బంజారాహిల్స్, డిసెంబర్ 18: డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహణ కోసం డబ్బులు తీసుకుని ఆఖరి నిమిషంలో ముఖం చాటేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వాహకుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన ఆనంద్‌రాజ్(29) అనే యువకుడు శేరిలింగంపల్లిలోని ఆదర్శనగర్‌లో నివాసం ఉంటూ ముత్తంగిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 3న తన పెళ్లిని మొయినాబాద్ సమీపంలోని ఓ రిసార్ట్‌లో ప్లాన్ చేసుకున్నారు. దీనికోసం బంజారాహిల్స్ రోడ్ నెం 11లోని లేక్‌వ్యూ ఆపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న ఈవెంట్ ప్లానర్ సందీప్ చక్రవర్తిని రోడ్ నెం 14లోని కాఫీడేలో సెప్టెంబర్ 8న కలిశారు.
డిసెంబర్ 3నుంచి 5వరకు రిసార్ట్‌లో పెళ్లి వేడుకను అట్టహాసంగా జరిపిస్తామని, దీనికోసం రూ.16,85,000 ఖర్చవుతుందని సందీప్ చక్రవర్తి చెప్పడంతో ఈ మొత్తాన్ని పలు దఫాలుగా చెల్లించారు. కాగా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకున్న తర్వాత డిసెంబర్ 2న తాను ఈవెంట్‌ను చేయడం లేదంటూ మెసేజ్ చేసిన సందీప్ చక్రవర్తి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో పెళ్లికి ఏర్పాట్లు చేసి వెండర్లకు డబ్బును మొత్తం ఆనంద్‌రాజ్ చెల్లించాల్సి వచ్చింది. ఈవెంట్ కోసం రూ.16,85,000 తీసుకోవడమే కాకుండా ఆఖరి నిమిషంలో మోసం చేసిన సందీప్చక్రవర్తి, అతడి స్నేహితురాలు సుజాత గంగూలీ, భార్య సాండీ వైదేహీలపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఆనంద్‌రాజ్ గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.