Bonala Jathara | సికింద్రాబాద్ నుంచి గోల్కొండ వరకు.. నగరంలో ఎక్కడ చూసినా ఆషాఢ మాసం బోనాల సందడి కనిపిస్తున్నది. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించగా, గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నాలుగో బోనం పూజలు జరిగాయి. నగరం నలుమూలలు, శివారు జిల్లాల నుంచి లక్షలాదిగా వచ్చిన ప్రజలు అమ్మవారికి మొక్కులు చెల్లించి ఆశీర్వాదం అందుకున్నారు. తొట్టెల ఊరేగింపుతో పాటు శివసత్తులు, పోతురాజుల విన్యాసాలతో బోనాల పండుగ ధూం ధాంగా జరుగుతున్నది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి బోనాల ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బంగారు బోనం సమర్పించారు.
మెహిదీపట్నం జూలై 2 : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నాలుగో బోనం పూజను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరం, శివారు జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో కోట కిక్కిరిసింది. కోట లోపల బోనాలు చేసుకోవడానికి వచ్చిన భక్తులతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం దర్శనమిచ్చింది. యువకుల కేరింతలు, శివసత్తులు ఫూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. బోనాలను అమ్మవారికి సమర్పించి, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, కార్వాన్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఠాకూర్ జీవన్‌సింగ్, ఈవో శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మహంకాళి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. కోట ప్రధాన గేట్ వద్ద గోల్కొండ పోలీస్ స్టేషన్ మైత్రి, పీస్ కమిటీ అధ్యక్షుడు సిరుగుమల్లె రాజువస్తాద్ నేతృత్వంలో సభ్యులు సేవలు అందించారు. దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ఖరె ప్రభాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. పఠాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువ నేత నీలం మధు, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ తదితరులు అమ్మవారికి పూజలు చేశారు. ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలకోసం మూడు వైద్య శిబిరాలు, తాగునీటి కోసం మూడు చోట్ల వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
నాలుగో బోనం పూజ సందర్భంగా కార్వాన్, సబ్జిమండి, లంగర్‌హౌస్, ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి, పురాణాపూల్, మాసబ్‌ట్యాంక్, చింతల్‌బస్తీ, పోచమ్మ బస్తీ, రెడ్‌హిల్స్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 వరకు తొట్టెలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. లంగర్‌హౌస్ చౌరస్తా సమీపంలో లంగర్‌హౌస్ గౌడ సంఘం, బస్తీ సంక్షేమ సంఘం, ఇసుర్రాయి మైసమ్మ ఆలయ కమిటీ, బీజేవైఎం, రాందాస్ పురా సంక్షేమ సంఘం, ఎమ్మార్పీఎస్, ఎంఐఎం, లక్ష్మీనగర్ యువజన సంఘం, ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ..స్వాగత వేదికల వద్ద తొట్టెల ఊరేగింపులకు పూజలు చేసి స్వాగతం పలికారు.
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి భక్తులు బంగారు బోనం సమర్పించారు. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకుని.. తలపై బంగారు బోనం పెట్టుకుని ప్రదర్శనగా బ్రాహ్మణ వీధి నుంచి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. జమ్మిదొడ్డి వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. జోగిని విశాక్రాంతి అమ్మవారికి తొలి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, వడిబియ్యం, కృష్ణమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో ధర్బముళ్ల భ్రమరాంబ, స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాదశర్మ, ఇతర అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికారు.
బేగంపేట్, జూలై 2 : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఆదివారం తొలిబోనం సమర్పించారు. జోగిని శ్యామల అమ్మవారి బోనాన్ని తలపై పెట్టుకుని డప్పుల దరువులు, పోతరాజుల విన్యాసాల మధ్య నృత్యం చేస్తూ బోయిగూడలోని మాజీ కార్పొరేటర్ అత్తెల్లి మల్లికార్జున్ గౌడ్ ఇంటినుంచి బోనంతో ఊరేగింపుగా వచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు బోనంతో రావడంతో కోలాహలం నెలకొంది. అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనానికి పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. జోగిని శ్యామల దేవాలయంలో అమ్మవారికి బోనం సమర్పించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ గౌడ్, నాయకులు తలసాని సాయికిరణ్ యాదవ్, స్కైలాబ్, మహేశ్ యాదవ్, తదితరులు బోనం ఊరేగింపులో పాల్గొన్నారు. దేవాలయం వద్ద భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయ ఈఓ గుత్తా మనోహర్ రెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేపట్టారు.
ఈనెల 9,10 తేదీల్లో జరుగనున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనం ఊరేగింపు ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారన్నారు. 8 చోట్ల 3 డీ మ్యాపింగ్, పోలీసు బందోబస్తు, అదనంగా సీసీ కెమెరాలు, బోనాలతో వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.