Property Tax | బండ్లగూడ, మార్చి 27 : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో టార్గెట్‌ను చేరుకోవడం కష్టమే అనిపిస్తుంది. కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లకు అధికారులు అనేక చర్యలు చేపట్టిన ఫలితం అంతంత మాత్రమే కనిపిస్తుంది. ఆస్తి పన్ను చెల్లింపు ఇంకా మూడు రోజులే ఉండడంతో వారు లక్ష్యాన్ని చేరుకోవడం ఇబ్బందిగా మారింది.
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం ఆస్తి పన్ను చెల్లింపుదారులు 35982 మంది ఉండగా అందులో 22947 మంది ఆస్తి పన్నును చెల్లించినట్లు అధికారులు తెలిపారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి డిమాండ్ మొత్తం 33 కోట్ల 80 లక్షలు ఉండగా నేటికీ 9 కోట్లు వసూళ్లు అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో 59 శాతం ఆస్తి పన్ను వసూలు అయింది. గత ఏడాది ఆస్తి పన్ను మొత్తం 73 శాతం వసూలు అయింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడుతుండడంతో గత ఏడాది ఆస్తి పన్ను వసూలు శాతం చేరుకోవడం కూడా కష్టంగా కనిపిస్తుంది. పూర్తిస్థాయిలో ఆస్తి పన్ను వసూళ్లకు అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఆస్తి విలువ పెరగడంతో పన్ను వసూళ్లలో ఆలస్యం జరుగుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు.
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూలు కోసం అధికారులు మొండి బకాయిదారులు 80 మందికి రెడ్ నోటీసులను జారీ చేసినట్లు తెలిపారు. కాగా అందులో ఆస్తి పన్ను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారని రెవిన్యూ అధికారి శివా తెలిపారు.
బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తిపన్నుదారులు గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేవి. కాగా గత ఐదేళ్లుగా గ్రామపంచాయతీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడడంతో ఆస్తి పన్నులు పెరిగాయి. దీంతో ఆస్తి పన్నుదారులు తమ ఆస్తి పన్నును చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లుగా పలువురు సిబ్బంది వాపోతున్నారు. ఒకేసారి ఆస్తి పన్ను రెండు మూడు రెట్లు పెరగడంతో ఆస్తి పన్ను చెల్లించేందుకు ఇబ్బందిగా ఉందని ఆస్తి పన్నుదారులు కూడా పేర్కొంటున్నారు. దీని కారణంగానే ఆస్తిపన్ను వసూలు నెమ్మదిగా కొనసాగుతున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.