సిటీబ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరాచకాలు, లైంగిక వేధింపులను నిరసిస్తూ..ఆదివారం నగరవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో డీజీపీ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో పలువురు విద్యార్థి సంఘం నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, భగీరథ్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసులో పోలీసులు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదివారం లక్డీకపూల్ వద్ద ఉన్న డీజీపీ కార్యాలయాన్ని బీఆర్ఎస్వీ ముట్టడించింది. వెంటనే భగీరథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు పడాల సతీష్, తుంగ బాలు, స్వామి యాదవ్, వెంకట్ గౌడ్, రాజేష్ నాయక్, జంగయ్య, మిథున్, శ్రీకాంత్, అవినాష్, నితీష్, రాహుల్, విశాల్, క్రాంతి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు పేట్ బషీర్బాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళా నేతలు ఆందోళన నిర్వహించారు.