హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై(BJP office) కాంగ్రెస్ మూకలు దాడి చేయడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా? పిల్లలు, వృద్ధులకు రాళ్ల తగిలితే పరిస్థితి ఏ విధంగా ఉండేదా తెలియదా? అని నిలదీశారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్ద న్నారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. తక్షణమే దాడికి పాల్పడ్డ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఎంపీ ప్రియాంక గాంధీపై(Priyanka gandhi) బీజేపీ నేత రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌పై( BJP) కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు ఎదురుతిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.