Hyderabad | సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో 10 గంటలైతే దుకాణాలు మూత పడుతున్నాయి. ఈ కారణంగా చార్మినార్‌ను చూసేందుకు రాత్రి వేళలో వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు 10 గంటల తర్వాత బయట తిరిగే వారిపై హైదరాబాద్ పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు. ఇలా పాతనగరంలో పోలీసులు ఇంటి వద్ద నిల్చున్నా..చితకబాదిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ఇదే అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో లేవనెత్తాయి. హైదరాబాద్ పోలీసులు.. ఫెయిల్యూర్ పోలీస్ అంటూ ఆరోపణలు చేశారు. నేరగాళ్లపై నిఘా ఉంచి పట్టుకోవాల్సిన టాస్క్‌ఫోర్స్ రాత్రి అమాయకులను కొడుతూ.. పగలు నిద్రపోతుందంటూ ధ్వజమెత్తారు. తాజాగా రాత్రి వేళల్లో పోలీసులు లాఠీలకు పనిచెప్పడం తగ్గించారు. అయితే దుకాణాలు మాత్రం రాత్రి 10 గంటలకే మూత పడుతున్నాయి. చార్మినార్‌ను చూసేందుకు రాత్రి వేళల్లో కూడా చాలా మంది వస్తుంటారు.
చుట్టుపక్కల ఉండే హోటళ్లు రాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండేవి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఈ విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. యువత బయట తిరగకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కొందరంటుంటే.. మరికొందరు మాత్రం పర్యాటక ప్రాంతంగా ఉండే చార్మినార్ వంటి ప్రాంతంలో 10 గంటలకే దుకాణాలు మూసివేయడంతో ఇక్కడకు వచ్చే వారి సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టిందంటూ స్థానికులు పేర్కొంటున్నారు.
బడా బాబుల హోటళ్లు.. బార్లు మాత్రం..
సాధారణ హోటళ్లను రాత్రి 10 గంటలకే మూసేయిస్తున్న పోలీసులు.. బార్లు, బడాబాబుల హోటళ్లను మాత్రం 12 గంటల వరకు కొనసాగినా..ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మద్యం, బార్లు రాత్రి 12 గంటల వరకు చాలా చోట్ల తెరిచి ఉంటున్నాయనే విమర్శలున్నాయి.
అలాగే బంజారాహిల్స్‌లోని కమిషనరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న నిలోఫర్ హోటల్ 12 గంటల వరకు తెరిచి ఉంటుందని.. స్వయంగా అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా అనేక ప్రాంతాల్లో హోటళ్లు, బార్లు తెరిచి ఉన్నా..పోలీసులు చూసీచూడనట్లు ఉంటున్నారని, అలాంటి వారి వద్ద నెల వారీగా మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.