నగరంలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకూ వివిధ వర్గాల మద్దతుతో పాటు విభిన్న రంగాల వారి సమ్మతం పెరుగుతున్నది. నగర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాలు, రంగాల వారిని కలుపుకుపోతూ మద్దతును కూడగట్టుకుంటున్నారు. కార్మికులు, క్యాబ్ డ్రైవర్స్, యువత, ఇంకా పలు వర్గాల నేతలు, ప్రజలు పని చేసే బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు అని, ప్రజా సమస్యలు పట్టించుకునే సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని, కేసీఆరే ముచ్చటగా మూడోసారి తమ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తున్నారు. నగరం అంతటా గులాబీ పార్టీకి జనం నుంచి అమోఘమైన మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ మరోసారి పాలనలోకి రావడం ఖాయమని అభిమాన జనం భజాయించి చెబుతున్నారు.
ఉప్పల్, నవంబర్ 14: ఉప్పల్ నియోజకవర్గ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ పంక్షన్ హాల్లో బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య, వైస్ ప్రెసిడెంట్ హమాలి శ్రీను ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండారి మాట్లాడుతూ కార్మికులకు భరోసాగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరు అండగా ఉండాలన్నారు. కార్మికులకు అత్యధికంగా జీతాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చాటి చెప్పారు. కేసీఆర్ పాలనలో కార్మికులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్మికులతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, కార్మికులను తన ట్రస్టు ద్వారా నిత్యం ఆదుకుంటూ సేవలు చేస్తున్నామని మరో మారు గుర్తు చేశారు. ఎవరికి సమస్యలు వచ్చినా తాను ముందుంటానని, భరోసాగా నిలుస్తానని ఉద్ఘాటించారు.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం పాటుపడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే టికెట్ రాక ముందు నుంచే పనులు చేస్తున్నానని, అవకాశం ఇస్తే ప్రజలకు సేవకుడిగా నిరంతరం సేవలు అందిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను అమలు చేస్తామని, ప్రతి పక్షాల మోసపూరిత హామిలు నమ్మవద్దన్నారు.
కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామన్నారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ల అనుబంధ సంఘాలు ఏకగీవ్ర తీర్మానం చేస్తూ, బండారికి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు తీర్మాన పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటరు ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, కార్మిక నాయకులు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.