సిటీబ్యూరో: మీ ఇంటికి, వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తిపన్నును సక్రమంగానే చెల్లిస్తున్నారా? అనుమతి తీసుకున్న దాని కంటే అదనంగా ఏమైనా గదులు నిర్మించారా? అయితే వెంటనే అప్రమత్తం కావాల్సిందే.. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తిపన్ను ఎగవేతదారులపై, తప్పుడు సమాచారంతో తక్కువ పన్ను కడుతున్న వారిపై అధికారులు దృష్టి సారించారు. పన్ను సవరించుకునే సదావకాశాన్ని ఇచ్చేందుకు కమిషనర్ కర్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే మార్చి 1 నుంచి పన్ను సవరించుకోని వారిని గుర్తించి భారీ జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులను కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చేవరకు వేచి చూడకుండా.. యజమానులే ఆస్తి పన్నును సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
చాలా మంది భవన యజమానులు అనుమతి పొందిన విస్తీర్ణం కంటే అదనంగా వినియోగిస్తుండడం, మరికొందరు బిల్ కలెక్టర్ల ప్రోత్సాహంతో తక్కువ పన్నును కడుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ముఖ్యంగా కమర్షియల్ విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్రేడ్ లైసెన్స్ చార్జీలను తక్కువగా రికార్డుల్లోకి ఎక్కించి అతి తక్కువ ఫీజును చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చే వరకు వేచి చూడకుండా యజమానులే స్వచ్ఛందంగా తమ ఆస్తి వివరాలను సవరించుకోవాలని, ఈ మేరకు జీహెచ్ఎంసీ ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్లి ‘సెల్ఫ్ అసెస్మెంట్’ ఆప్షన్ ద్వారా సక్రమంగా ఆస్తిపన్నును చెల్లించేలా అధికారులు సూచిస్తున్నారు.