సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : నగరంలో భారీ వానలతో పొంచి ఉన్న వరద ముప్పునకు బల్దియాలో భారీ సంపులను కాంగ్రెస్ కొత్తగా నిర్మించింది. వీటి ద్వారా నీరు నిలిచే ప్రాంతాల్లోని వరద నీరు సంపుల్లోకి చేరుతుందనీ, రోడ్లపై ఇక వరద నీరు ఉండదనీ తేల్చి చెప్పింది. ఇందు కోసం నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి 10 ప్రాంతాల్లో నిర్మించారు. కానీ సంపులు ఉన్న ప్రాంతాల్లోనూ పోటెత్తిన వరద నీటితో ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి.
దీంతో సచివాలయం, సోమాజీగూడ కేసీపీ జంక్షన్, రాజ్‌భవన్ సమీపంలోని లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, పీవీ ఎక్స్‌ప్రెస్ వే వంటి ప్రాంతాల్లో నిర్మించిన సంపులన్నీ నీట మునిగి రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. ఇక్కడ చేరిన నీటిని తొలగించేందుకు బల్దియా ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో రాజ్‌భవన్ మార్గంలో మోకాళ్ల లోతున వరద నీరు నిలిస్తే, సచివాలయం ఎదుట అర్థరాత్రి వరకు ద్విచక్ర వాహనాలు సగం లోతు వరద నీటిలో ప్రయాణించాల్సి వచ్చింది.