సుల్తాన్‌బజార్, నవంబర్ 23: చిన్నారుల అదృశ్యానికి చిరునామాగా మారిన నీలోఫర్ దవాఖానలో మరోసారి నెల రోజుల పసికందు కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. దవాఖాన సిబ్బందినని చెప్పి అమ్మమ్మ వద్ద నుంచి నెలరోజుల పసికందును గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనా యుడు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫార్ దంపతులకు చెందిన నెలరోజుల పసికందు అనారోగ్యం బారిన పడటంతో అక్టోబర్ 29వ తేదీన నీలోఫర్ దవాఖానలో అడ్మిట్ చేశారు.
కాగా, చికిత్స పొంది, కోలుకున్న పసికందును శనివారం దవాఖాన వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం దవాఖాన పాత భవనంలోని ఆరోగ్యశ్రీ కౌంటర్ వద్ద రవాణా ఖర్చులు తీసుకుని ఫొటో దిగుతుండగా.. పక్కనే ఉన్న గుర్తుతెలియని మహిళ వచ్చి చిన్నారిని తనకు ఇచ్చి ఫొటో దిగాలని చిన్నారి తల్లి హసీనాబేగంకు సూచించింది. ఆమె మాటలు నమ్మిన హసీనాబేగం చిన్నారిని గుర్తుతెలియని మహిళకు ఇచ్చి ఫొటో దిగి, తిరిగి చూసేసరికి సదరు మహిళ అక్కడ కనిపించలేదు.
దీంతో దవాఖాన మొత్తం కలియతిరిగినా ఆ చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళ కనిపించలేదు. చేసేదిలేక తన బిడ్డ ఆచూకీ తెలుపాలని బోరున విలపిస్తూ హసీనాబేగం దవాఖాన సూపరింటెండెంట్‌తోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నీలోఫర్ దవాఖానలో గతంలో కూడా పలుమార్లు చిన్నారులు కిడ్నాప్‌నకు గురైన సంఘటనలు విదితమే. దీంతో దవాఖానలో పటిష్టమైన నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కిడ్నాపర్లు యధేచ్చగా దవాఖానలో తిష్టవేసి అమాయక తల్లిదండ్రుల నుంచి చిన్నారులను గద్దల్లా ఎత్తుకెళ్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.