బన్సీలాల్‌పేట్, జూన్ 1: కిడ్నీ సంబంధిత వ్యాధులు, డయాలసిస్ కేంద్రాల నిర్వహణ గురించి నోడల్ అధికారులతో గాంధీ మెడికల్ కాలేజీలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ విశాలాక్ష్మి, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, నెఫ్రాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ మంజూషలు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గాంధీ దవాఖాన హబ్ పరిధిలోని 22 డయాలసిస్ స్పోక్ కేంద్రాల నోడల్ అధికారుల నైపుణ్యాలను పెంచి, గ్రామీణ ప్రాంత నిరుపేద కిడ్నీ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ సదస్సులో కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జనగామ, ఇల్లందు, ఖమ్మం, కోరుట్ల, వేములవాడ, గోదావరిఖని, హుజూరాబాద్, ధర్మపురి, జగిత్యాల, మణుగూరు, మహదేవ్పూర్, జాఫర్‌గఢ్, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వరావుపేట్, నర్సంపేట్, మహబూబాబాద్ డయలసిస్ కేంద్రాల నోడల్ అధికారులు హాజరయ్యారు. గాంధీ దవాఖాన నెఫ్రాలజీ వైద్యులు డాక్టర్ విక్రమ్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.