బంజారాహిల్స్,జనవరి 22: పేదలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి కండ్లద్దాలు, సర్జరీలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం రెండురోజుల సెలవుల తర్వాత సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్‌పేట డివిజన్ల పరిధిలోని ఆరు కంటి వెలుగు కేంద్రాల్లో మొదటి రెండురోజుల్లో 1480 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. వారిలో 579 మందికి కంటి అద్దాలు అందజేసిన వైద్యశాఖ అధికారులు 285 మందికి సర్జరీలు అవసరమని గుర్తించడంతో పాటు ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేశారు. సోమవారం నుంచి కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం కానుండడంతో ఆయా కేంద్రాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ సర్కిల్ -18 ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని కేంద్రాల ప్రాంగణాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. పరీక్షల కోసం వచ్చేవారు ఇబ్బందులు పడకుండా డీఎంసీ రజినీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సరిపోయినన్ని కుర్చీలతో పాటు మంచినీరు అందుబాటులో ఉంచారు. ఇంటింటా వెళ్లి అవగాహన కల్పిసున్నట్లు డీఎంసీ రజినీకాంత్‌రెడ్డి తెలిపారు.
సద్వినియోగం చేసుకోండి
రాష్ట్రంలో కంటి సమస్యలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. 100రోజుల పాటు బస్తీలు, కాలనీలలో ఇంటికి సమీపంలోనే కమ్యూనిటీ హాళ్లలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కంటి వెలుగుపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
– దానం నాగేందర్, ఎమ్మెల్యే