Auto Unions | హిమాయత్‌నగర్, ఆగస్టు 3 : ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజాహిద్ హష్మి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంకు బదులు సంపూర్ణ మద్యపాన నిషేదం విధించడంతో పాటు ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల14న ఒక రోజు జరిగే ఆటో బంద్‌లో ఆటో డ్రైవర్లు అధిక సంఖల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిం చడం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలను పోషించులేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు జీవన భృతి ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్డు ప్రమాదాలు, హత్యలు, నేరాలు, మహిళలు, యువతులపై వేధింపులు, దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు డీలర్లు, ఆటో ఫైనాన్షియర్లు కుమ్మకై కొత్త ఆటోలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ఆటో బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై పి.డి.యాక్ట్ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.12000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆటో జేఏసీ నేతలు మహ్మద్ లతీఫ్, షరీఫ్, యాహియా, సలీం, షేక్ అమీర్ పాల్గొన్నారు.