ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ వద్ద బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నంద కిశోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి యన్.కిషన్, నాయకులు యండీ.హబీబ్, ఇ.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో/హిమాయత్‌నగర్/ముషీరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : “వద్దురా నాయనా..కాంగ్రెస్ పాలన, నమ్మి మోసపోయాం.. మా బతుకులు ఆగమాగం, సీఎం రేవంత్ డౌన్ డౌన్,” అంటూ నగరంలో ఆటో డ్రైవర్లు నినదించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయంటూ ఆటో సంఘాల నాయకులు నగరంలో వివిధ ప్రాంతాల్లో నిరసనలు, సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఏటీయూ(తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్) ఆధ్వర్యంలో 600 మందికిపైగా ఆటో డ్రైవర్ల సదస్సు భారీ ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా భారతీయ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ.. ఆటో డైవర్ల సంఘాలన్నీ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలకతీతంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే డ్రైవర్లు ఇప్పుడు 300 కూడా దాటడం లేదని వాపోయారు. ప్రభుత్వం డ్రైవర్లకు ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ పి.నారాయణ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో ఆటో డ్రైవర్ల సమస్యలపై “ప్రభుత్వ విధానం-పరిష్కార మార్గాలు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం (ఏఐటీ యూసీ), కో-కన్వీనర్లు వి.కిరణ్(ఐఎఫ్టీయూ), బి.శ్రీకాంత్(సీఐటీయూ), మల్లేశ్‌గౌడ్ (ఐఎన్టీయూసీ), ఎంఏ సలీం (ఆటోజేఏసీ) మాట్లాడుతూ… ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లకు రోజు వారి గిరాకీ లేకపోవడంతో రాష్ట్రంలో ఉన్న 7లక్షల మంది ఆటోడ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయం ఉపాధి పొందేందుకు ప్రైవేట్ ఫైనాన్సియర్ల వద్ద రుణాలు తీసుకుని ఆటోలను కోనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు పలు రూపాల్లో చలాన్లు విధిస్తూ ఆటో డ్రైవర్లపై మరింత ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు.
మహేశ్వరం, డిసెంబర్ 19: ఆటో కార్మికులకు తగిన న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మహేశ్వరం మండల కేంద్రంతో పాటు అమీర్‌పేట్, తుక్కుగూడ ప్రాంతాల్లో ఆటో కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆటో కార్మికులను రోడ్డున పడేశారని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ఆటోలను నడుపుతున్నామని, ప్రభుత్వ విధానం వల్ల ఫూట గడవని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు నెలకు రూ. 20 వేలు చెల్లించి, రూ. 25 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఏర్పుల శేఖర్, అమీర్‌పేట్, మహేశ్వరం, తుక్కుగూడ ప్రాంతాలకు చెందిన ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు.

ఎల్బీనగర్, డిసెంబర్ 19 : ఫ్రీ బస్సు సౌకర్యంతో తమ బతుకులు ఆగమవుతున్నాయంటూ ఆటో డ్రైవర్లు నిరసన గళం విప్పారు. సుమారు రెండు వందల మంది ఆటో డ్రైవర్లు నాగోలు చౌరస్తా నుంచి మోహన్‌నగర్ కొత్తపేట మీదుగా దిల్సుఖ్నగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనలో పలవురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హన్మంతు, శంకర్ నాయక్, శ్రీకాంత్ యాదవ్, చంటి, అశోక్ యాదవ్, రాజు యాదవ్, సురేశ్, కిశోర్, బాలు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ఆందోళనలో పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసి మా బతుకులు ఆగం చేయొద్దు. పౌర సంఘాలు బయటకు వచ్చి మాట్లాడాలి. మా బతుకులను కాపాడుకోవడానికి మాకు హక్కు ఉంది. ఆటో సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలి. ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. జనవరి 7న ఇందిరా పార్కులో ఆటో కార్మికుల మహాధర్నా నిర్వహించబోతున్నాం. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఆందోళనకు గురవుతున్నాడు. కొంతమంది అనారోగ్యంతో చనిపోతున్నారు. ఆటో నడుపుకోపోతే ఎలా బతకడమనేది ఇప్పుడు వెంటాడుతున్న ప్రశ్న. ప్రభుత్వం మా డిమాండ్‌ను దయతో పరిష్కరించాలి.
– వేముల మారయ్య, టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
మా జీవితాలు రోడ్డున పడుతాయని అనుకోలేదు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మేలు జరుగుతుందని చాలా మంది నాయకులు చెప్పారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడటానికి ముందుకు రావడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినవసరం రాలేదు. కాంగ్రెస్ వచ్చిన తొలిరోజు నుంచే బతుకు కోసం పోరాడాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
– వాజిద్, అధ్యక్షుడు, నల్గొండ
ఆటో డ్రైవర్లను ఆగం జేసిన కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మా బతుకులకు భరోసానివ్వకుండా ఆగం చేసే హక్కు ఈ ప్రభుత్వానికెక్కడిది? ఏండ్ల తరబడి మేం ఆటోలను నమ్ముకున్నాం. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి అయ్యే వరకు మేం అందుబాటులో ఉంటాం. ఊర్లల్లో ఆపదొస్తే ఏ రాత్రైనా సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు మా ఆటో వృత్తి కనుమరుగైతే ప్రజలకు ఆపదలో ఏ వాహనాలు తోడుంటాయి. ఆటో కార్మికులకు ప్రభుత్వ రంగంలో ఉపాధి చూపించాలి.
– పి. శ్రీనివాస్, అధ్యక్షుడు, సిరిసిల్ల