Hyderabad | సైదాబాద్, ఏప్రిల్ 8 : అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కోలా సత్యనారాయణ కథనం ప్రకారం.. బండ్లగూడకు చెందిన మహమ్మద్ అస్లాం (22) వృత్తి రీత్యా ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అస్లాం సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తుండగా, సంతోష్ నగర్ డిబిషా దర్గా సమీపంలోని స్మశాన వాటిక వద్ద రక్తపు మడుగులో యువకుడు పడినట్లు సంతోష్ నగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని రక్తం మడుగులో పడి ఉన్న యువకుడిని ఆటో డ్రైవర్ అస్లాంగా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అస్లాం హత్యకు ఫైజల్ అనే వ్యక్తి కారణమంటూ మృతుడి తల్లి రెహనా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హత్యకు గల కారణాలపై విశ్లేషిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని
తెలిపారు.