హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడు తన తల్లికి మెడిసిన్స్ కోసం నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర్ నుంచి లక్డీకాపూల్‌కు మెట్రోలో ప్రయాణించాడు. అక్కడ్నుంచి బస్సులో మెహిదీపట్నంకు చేరుకున్న నాగార్జున.. ఓయూ కాలనీ వెళ్లేందుకు ఆటోను ఎక్కాడు. అప్పటికే ఆటోలో ఇద్దరు ఉన్నారు. అయితే ఆటోను ఓయూ కాలనీ వైపు తీసుకెళ్లకుండా నానల్ నగర్ వద్ద లంగర్ హౌజ్ వైపు మళ్లించారు.
ఈ రూట్లో ఎందుకు వెళ్తున్నావని ఆటో డ్రైవర్‌ను నాగార్జున ప్రశ్నించగా, ఆటోలో ఉన్న మిగతా ఇద్దరు గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. అరిస్తే కత్తితో పొడిచేస్తామని భయపెట్టించారు. దీంతో ఆ యువకుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. సన్ సిటీ తర్వాత ఆటోను ఆపి యువకుడిని చితకబాదారు. అతని వద్ద ఉన్న రూ. 3 వేల నగదు, రూ. 20 విలువ చేసే సెల్‌ఫోన్‌ను దుండగులు లాక్కెళ్లారు. బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.