సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభకు గ్రేటర్ నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే సభ నిర్వహణపై తెలంగాణ భవన్లో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల సమావేశం నిర్వహించి.. బహిరంగ సభకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.
ఇందులో భాగంగానే గ్రేటర్ వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకున్నారు. 500 ఆర్టీసీ బస్సులతో పాటు భారీ ర్యాలీలతో కార్లలో నల్గొండకు వెళ్లేలా ప్లాన్ చేశారు. కృష్ణా జలాల హక్కులపై బీఆర్ఎస్ పోరాటం వల్లే కృష్ణా ప్రాజెక్టులు అప్పగించలేదని కాంగ్రెస్ తీర్మానం చేసిందని, ఇది కేసీఆర్ విజయమని హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు , జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. నల్గొండ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివెళ్లి సభను విజయవంతం చేస్తామన్నారు.