మాదాపూర్, జూలై 12: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరు మరణించారు. ఈ ఘటన శుక్రవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అరవింద్ సింగ్ (21), మన్సింగ్ స్నేహితులు. వీరిద్దరూ కలిసి మియాపూర్‌లోని కల్వరీ టెంపుల్ రోడ్డులో ఉంటూ.. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇరువురు తరచూ గొడవ పడుతుంటారు. ఈనెల 8వ తేదీన కల్వరీ టెంపుల్ రోడ్డులో ఇద్దరు మద్యం సేవించి గొడవపడ్డారు. అరవింద్‌సింగ్ తన చేతి కడియంతో మాన్సింగ్ ముక్కు, తలపై బలంగా కొట్టాడు. దీంతో మాన్సింగ్ స్పృహతప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించగా.. మాన్సింగ్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి మేనమామ మిథున్ సింగ్ మియాపూర్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.