సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ): కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడం, అసెంబ్లీ ఎన్నికల నగరా మోగడంతో గ్రేటర్ బీఆర్ఎస్లో కదనోత్సాహం కనిపిస్తున్నది. ఎన్నికల రణరంగానికి ముందస్తుగానే సిద్ధమైన పార్టీ శ్రేణులు గడిచిన రెండు నెలలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ జనంతో మమేకయ్యారు. తాజాగా షెడ్యూల్ ప్రకటనతో ప్రచార పర్వం మరింత దూకుడుగా ఉండేలా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. వాడలు, బస్తీలు, కాలనీలను చుట్టేసి మద్దతు కూడగట్టారు. ఇప్పటికే ఒక దఫా ఎన్నికల ప్రచారాన్ని పూర్తిచేసిన అభ్యర్థులు, షెడ్యూల్ ఖరారు చేయడంతో మరోమారు ఓటర్లతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోగా, బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఎన్నికల గోదాలో ముందంజలో ఉండనున్నారు. ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా గులాబీపార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతున్నది. ప్రతిపక్ష పార్టీలు టికెట్ ఖరారులోనే పడరాని పాట్లు పడుతుంటే బీఆర్ఎస్ మాత్రం ప్రచారంలో తనదైన పంథాతో సత్తా చాటుతున్నది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లోని మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీ రాష్ట్ర నాయకులు అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తూ ప్రచారాన్ని ఉధ్రుతం చేశారు. ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు ఒకవైపు మరోవైపు కలిసివచ్చే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలతో క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపుతూ అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి అభ్యర్థుల గెలుపునకు బాటలు సుగమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పథకాలే ప్రచార అస్త్రంగా కాలనీలు, బస్తీలు కలియతిరుగుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రధానంగా అన్ని వర్గాలు అభ్యర్థులకే మద్దతు అంటూ స్వచ్ఛంధంగా ముందుకు వస్తుండడం, ప్రచారానికి ప్రజల నుంచి ఆపూర్వ ఆదరణ లభిస్తున్న తీరు పట్ల పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లెరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.