Hyderabad | సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా జీహెచ్ఎంసీ చేపడుతున్న పలు చోట్ల జంక్షన్ల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో పురోగతి ఉన్న పనులు మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా పనులు జరుగుతున్నాయి. వీటికి తోడు ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు జాయింట్ సర్వే చేసి 90 జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయం తీసుకుని ఐదు నెలలు కావొస్తున్నా.. ఇప్పటి వరకు ఏ ఒక్క చోట పనులు పట్టా లెక్కలేదు. హబ్సీగూడ, ఆరాంఘర్ చౌరస్తా, ఐఎస్ సదన్, నారాయణగూడ, సంగీత్ జంక్షన్ల పనుల్లో వేగం మందగించింది. జంక్షన్ల అభివృద్ధి పనుల్లో భాగంగా భూ సేకరణకు రూ. 233కోట్ల అంచనా వేసి అధికారులు నిధులు మంజూరు చేయకపోవడమే పనులు జరగకపోవడానికి కారణమని ఇంజినీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే చాలా చోట్ల జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహనాలు ముందకు కదలక నడిరోడ్డుపై జనం నరకం చూస్తున్నారు. దీనికి తోడు వీఐపీలు వచ్చి వెళ్లే సమయాల్లో మాత్రమే కనిపించే ట్రాఫిక్ సీఐలు, ఎస్ఐలు..వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో రోడ్లపై ఉండడం లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ చొరవ తీసుకుని జంక్షన్ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్తంభించిన నల్గొండ చౌరస్తా
మలక్‌పేట, మార్చి 2 (నమస్తే తెలంగాణ): మలక్ పేట నల్గొండ చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ రహదారిపై నల్గొండ చౌరస్తా నుంచి దిల్ సుఖ్ నగర్, సైదాబాద్ వైపు వెళ్లే జంక్షన్ వద్ద డ్రైనేజీ మ్యాన్ హోల్ కు మరమ్మతులు చేపట్టడంతో రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటసేపు డ్రైనేజీ పనులు కొనసాగడంతో రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి..వాహనాలను క్రమబద్ధీకరించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ జామ్ తో గంటసేపు ప్రయాణికులు అవస్థలుపడ్డారు.
కాగితాల్లోనే జంక్షన్ల అభివృద్ధి పనులు
గ్రేటర్లో జంక్షన్లలను అభివృద్ధి చేసి ట్రాఫిక్ జామ్ నివారణకు మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్, టౌన్‌ప్లానింగ్ అధికారులు జాయింట్ సర్వే చేశారు. ఇరు శాఖల క్షేత్రస్థాయిలో పర్యటించి 90 జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదించగా..ఇందులో 74 జంక్షన్లు ఆమోదం పొందాయి. ఇందులో ప్రతిపాదన దశలోనే నెలల తరబడి కాలయాపన చేస్తుండడం గమనార్హం.