హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే చర్యల్లో భాగంగా ఎన్నడూ లేని విధంగా మౌలిక సదుపాయాల కల్పనకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. అప్పులు తెచ్చినా.. భవిష్యత్ తరాలకు చెక్కు చెదరని ఆస్తులను చకచకా నిర్మించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ఫ్లైఓవర్ నిర్మాణానికి ఏండ్లకు ఏండ్లు సమయం పడితే.. కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం ఎనిమిదిన్నరేండ్లలోనే 36 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2015లో రూ.5112.36 కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టగా.. 36 ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఇందులో 20 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, ఏడు ఆర్వోబీ/ఆర్‌యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో మూడు ఇతర ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ సుడిగుండాలకు శాశ్వత చెక్ పెట్టారు.
– సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ)
Hyderabad | సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ) : ఒకవైపు నిధుల సమీకరణ.. మరోవైపు అభివృద్ధికి బాటలు వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే హైదరాబాద్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే చర్యల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కట్టాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్లకు ఏండ్లు సమయం పట్టేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కేవలం ఏనిమిదిన్నరేళ్లలో 36 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చి భవిష్యత్ తరాలకు చెక్కు చెదరని ఆస్తిగా మలిచింది. 2015 సంవత్సరంలో రూ.5112.36కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టగా.. 36 ప్రాజెక్టులు 20 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, ఏడు ఆర్వోబీ/ఆర్‌యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో మూడు ఇతర ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ సుడిగుండాలకు శాశ్వతంగా చెక్ పెట్టారు.
ప్రయాణం సాఫీగా సాగాలంటే.. వాహనం ఉంటే సరిపోదు. సరైన రోడ్డు మార్గం ఉండాలి. ఇదే స్ఫూర్తితో జీహెచ్ఎంసీ పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్ఆర్డీపీ) పథకం చేపట్టి అనతికాలంలోనే సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థగా మార్చారు. నగరవాసులకు మెరుగైన వసతులు, భవిష్యత్ పెట్టుబడిగా నిలిచే ప్రాజెక్టులకు దాదాపు రూ.6,200కోట్ల మేర జీహెచ్ఎంసీ రుణం తీసుకున్నది. ఎస్ఆర్డీపీకి బాండ్ల ద్వారా రూ.495 కోట్లు, ఎస్బీఐ నుంచి రూపీ టర్మ్ లోన్ ద్వారా రూ.2,500కోట్లు, సీఆర్ఎంపీకి రూ.1460 కోట్లు, నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) రూ.680కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పనుల కోసం రూ.140కోట్ల మేర హడ్కో వద్ద అప్పు చేశారు. హడ్కో మినహా మిగతా అప్పులకు ఇప్పటి వరకు దాదాపు రూ.40కోట్ల మేర వడ్డీ చెల్లిస్తున్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ముద్ర వేసేలా తొమ్మిదిన్నరేళ్లలో ప్రగతి పథంలో నగరాన్ని నిలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల్లో ప్రజలు ప్రగతికే పట్టం కట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించడం ఇందుకు నిదర్శనం. గ్రేటర్లో ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవకపోవడం గమనార్హం.
ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, ప్రధాన కారిడార్లలో సమగ్ర పద్ధతిలో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ప్రయాణం సాఫీగా జరగడంతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతుంది. అత్యధికంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, బాలానగర్, ఫతేనగర్, బాచుపల్లి, పటాన్చెరువు, అబిడ్స్, చార్మినార్, ఎల్బీనగర్ , చాంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ లేకుండా పరిష్కారం లభించింది. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన చోట ప్రయాణ సమయం తగ్గింది. మొబిలిటి పెరిగింది. వాహనదారులు సిగ్నల్ రహిత ప్రయాణం సాగిస్తున్నారు.