సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): వానకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. యాకుత్ పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్‌లతో కలిసి శుక్రవారం చార్మినార్ జోన్‌లోని సంతోష్ నగర్ సర్కిల్లో నాలా పనులు పరిశీలించారు.
మౌలానా కా చిల్లా, గంగానగర్ నాలాలతో పలు కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను కమిషనర్‌కు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ వివరించారు. జహంగీర్ నగర్ కాలనీ నుండి మౌలానా కా చిల్లా నాలా వరకు డ్రైనేజీ కాల్వ నిర్మాణం ఆవశ్యకతను కార్పొరేట్ కమిషనర్‌కు వివరించగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
కమిషనర్ వెంట జలమండలి ఎం.డి.అశోక్ రెడ్డి, జోనల్ కమిషనర్ వెంకన్న, జోనల్ ఎస్ఈ మహేశ్వర రెడ్డి, ప్రాజెక్టు ఈఈ బిఎల్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ మంగతాయారు, జలమండలి డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎం నాగేంద్ర, వినోద్ భార్గవ, జీఎంలు సంతోష్‌కుమార్, శ్యాంసుందర్ నాయక్, అశోక్‌లతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.