కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 30 : నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నలా ఆర్థిక సాయం అందిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన 93 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేద ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడని.. ఆడపిల్ల పెండ్లికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకంలో ఎన్నో పేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలను అందించారన్నారు. సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.