సుల్తాన్‌బజార్, నవంబర్ 2: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అరుణాచల గిరి ప్రదక్షిణ, పంచారామాల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీలత శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 13న ఎంజీబీఎస్, బీహెచ్ఈఎల్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయని ఆమె వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కాణిపాకం, వెల్లూరులోని శ్రీ నారాయణి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం 16న తిరిగి ప్రత్యేక బస్సులు హైదరాబాద్‌కు చేరుకుంటాయని చెప్పారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ స్పెషల్ బస్సుల టికెట్ బుకింగ్ కోసం ww w.tgsrtconline.in లో లేదా టీజీఎస్ఆర్టీసీ అన్ని కౌంటర్లలో బుక్ చేసుకోవాలన్నారు.
ఈ నెల 13న పటాన్‌చెరూ, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, మియాపూర్, కేపీహెచ్‌బీ, అమీర్‌పేట, ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. అరుణాచలం వెళ్లే భక్తులు బీహెచ్ఈఎల్ నుంచి సూపర్ లగ్జరీ రూ. 4000, రాజధాని రూ. 5360, ఎంజీబీఎస్ నుంచి సూపర్ లగ్జరీ రూ. 3900, రాజధాని రూ. 5230 టికెట్ చార్జీలను నిర్ణయించినట్లు చెప్పారు. మరింత సమాచారం కోసం 9959226149, 99592261 53,9959226249, 9959226250 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
అంతే కాకుండా ఈ నెల 3న ప్రతి ఆదివారం పంచారామాల ప్రత్యేక ప్యాకేజీని మియాపూర్ డిపో-1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ నెల 3న, 10న, 17న, 24వ తేదీల్లో పంచారామాలైన అమరావతి, భీ మవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాలకు ప్రతి సోమవారం రా త్రి పది గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి మియాపూర్ డిపో-1కు బస్సులు చేరుకుంటాయన్నారు.