అబిడ్స్, డిసెంబర్ 29 : దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు గాను నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహిస్తారు.
ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు దేశ, విదేశాలలో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారంటే అతి శయోక్తి కాదు. ఇప్పటికే దాదాపు స్టాళ్ల కేటాయింపులు పూర్తి కావడంతో పలు స్టాళ్ల నిర్మాణానికి గాను ఏర్పాట్లు సాగుతున్నాయి.
అన్ని వసతులు కల్పిస్తున్నాం..
ఎగ్జిబిషన్ ప్రదర్శనకు వచ్చే సందర్శకుల కోసం మరిన్ని వసతులు కల్పిస్తున్నాం. స్టాల్స్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సందర్శకుల కోసం ప్రత్యేకంగా మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయాలను పెంచనున్నాం. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాం.
– అశ్విన్ మార్గం, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు