బంజారాహిల్స్,మే 5: నగరంలోని పౌరులకు మరింత చేరువగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా వార్డు స్థాయిలో అధికార వికేంద్రకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫిర్యాదులతో పాటు ఏ సమస్య వచ్చినా సర్కిల్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. సర్కిల్ కార్యాలయాలు దూరంగా ఉండడంతో పాటు సమయానికి సంబంధిత అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో వివిధ రకాలైన పనులకోసం వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేలా వార్డు స్థాయిలోనే అధికారులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తే పౌరులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. దీంతో నగరంలోని 150 డివిజన్లలో వార్డు స్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ సర్కిల్ -18 పరిధిలో వార్డు పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
జూన్ 1నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని వార్డులలో పాలనా వ్యవస్థను ప్రారంభించనున్న నేపథ్యంలో సర్కిల్-18 పరిధిలో భవనాలను గుర్తించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సర్కిల్ పరిధిలోని బంజారాహిల్స్ డివిజన్ వార్డు కార్యాలయాన్ని బంజారాహిల్స్ రోడ్డు 12లోని జీహెచ్ఎంసీ మేనేజర్స్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్‌కు చెందిన వార్డు కార్యాలయాన్ని బంజారాహిల్స్ రోడ్డు మీ సేవ ప్రాంగణంలో ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ డివిజన్‌కు సంబంధించిన వార్డు కార్యాలయా న్ని జూబ్లీహిల్స్ క్లబ్ ఎదురుగా ప్రస్తుతం స్పోర్ట్స్ విభా గం ఆధ్వర్యంలో ఉన్న భవనంలో నిర్వహిస్తారు. షేక్‌పేట డివిజన్ వార్డు కార్యాలయాన్ని షేక్‌పేటలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేయనున్నారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న వార్డు కార్యాలయాల్లో క్షేత్రస్థాయిలో పనిచేయడానికి పదిమంది అధికారులు ఉంటారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్(ఏఎంసీ) ఈ కార్యాలయాలకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), న్యాక్ ఇంజినీర్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, శానిటేషన్ , ఎంటమాలజీ, అర్బన్ బయోడైవర్సిటీ, వెటర్నరీ విభాగంతో పాటు ఈవీడీఎమ్ నుంచి ఒక అధికారి వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారు. వీరితో పాటు రిసెప్షనిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ కూడా వార్డు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
మా సర్కిల్ పరిధిలో నాలుగు డివిజన్లకు సంబంధించిన వార్డు పాలనా వ్యవస్థకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు భవనాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. జూన్ 1నుంచి వార్డు పాలనా వ్యవస్థ ప్రారంభమవుతుంది. వార్డు కార్యాలయాల్లో పనితీరుపై 15రోజులకు ఒకసారి మేము సమీక్షిస్తాం. వార్డు కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసేందుకు వచ్చేవారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. కార్యాలయాల్లో ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదుల స్వీకరణ ఉంటుంది. దీంతో పాటు ఫిర్యాదుల పరిష్కరణకు సంబంధించిన సిటిజన్ చార్టర్ కూడా ఏర్పాటు చేయనున్నాం.
-రజినీకాంత్‌రెడ్డి, డీఎంసీ , జీహెచ్ఎంసీ సర్కిల్-18