Ganja | సిటీబ్యూరో, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): ఒకే ఒక్కడు.. కంటెయినర్లో తుక్కు మాటున గంజాయిని ఏపీ నుంచి హైదరాబాద్ మహా నగరం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తూ రాచకొండ పోలీసులకు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్‌గా పట్టుబడ్డాడు. ఇది వరకే రెండుసార్లు ఇలా గంజాయి స్మగ్లింగ్ చేసిన అనుభవంతో మూడోసారి కూడా అలాగే చేద్దామని వెళ్లి మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులకు దొరికిపోయిండు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు ఇందుకు సంబంధిత వివరాలను వెల్లడించారు. మహరాష్ట్రలోని పూణేకు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ డ్రైవర్.
ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఈజీ మనీ సంపాదనకు గంజాయిని స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే పూణేకు చెందిన వైభవ్, దేవలను కలిసి గంజాయి రవాణా విషయంపై మాట్లాడారు. తమకు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ నుంచి గంజాయిని తెచ్చి ఇస్తే ఒకో ట్రిప్పుకు రూ.3 లక్షలు ఇస్తామంటూ వైభవ్, దేవలు ఒప్పందం చేసుకున్నారు. దీంతో అహ్మద్ గులాబ్ తన వద్ద ఉన్న టాటా కంటెయినర్(ఎంహెచ్-16-సీడీ-2076)లో స్కాప్ వేసుకుంటాడు. తాను ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాడు. తన వద్దనున్న తుక్కులో గంజాయి ప్యాకెట్లను కలిపేసి తిరిగి అరకు, రాజమండ్రి, సత్తుపల్లి, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వచ్చి ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్ర రూట్లో వెళ్లిపోతుంటాడు.
ఇతడు ఒక్కడే ఎంత దూరమైనా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. క్లీనర్‌ను, ఇతరులను ఎవరిని నమ్మడు. తన వాహనంలో గంజాయి ఉన్న విషయం బయటకు పొక్కుతుందనే భావనతో ఒక్కడే లారీలో ఉంటాడు. ఈ క్రమంలోనే ఒకసారి 200, మరో సారి 150 కిలోల గంజాయిని మహారాష్ట్రకు తరలించి వైభవ్, దేవలకు అప్పగించాడు. ఇటీవల మరోసారి గంజాయి రవాణా చేసేందుకు సిద్ధమై విశాఖపట్టణం వెళ్లాడు. అక్కడ బుజ్జిబాబు అనే వ్యక్తిని కలిసి అతని వద్ద 300 కిలోల విలువైన 138 గంజాయి ప్యాకెట్లను తన కంటెయినర్లో దాచుకొని తిరిగి మహారాష్ట్రకు పయనమయ్యాడు.
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ వద్దకు ఈ కంటెయినర్ గురువారం రాగానే మహేశ్వరం ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా లారీని ఆపి తనిఖీలు చేయడంతో అందులో ఉన్న గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు రూ.1.05 కోట్ల విలువైన 300 కిలోల గంజాయి, కంటెయినర్లను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్ట్ చేశారు. గంజాయి సరఫరా చేసిన వాడితో పాటు మహారాష్ట్రలో గంజాయి విక్రయాలు చేస్తున్న వారి గూర్చి ఆరా తీస్తున్నామని, ఆయా రాష్ర్టాల పోలీసుల సహకారంతో వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీపీ వెల్లడించారు.