ఖైరతాబాద్, జూన్ 2: ఖైరతాబాద్‌లో అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ ఆడపిల్లపై వ్యక్తి లైంగికదాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బలవంతంగా గదిలోకి ప్రవేశించి ఆమెతో పాశవికంగా ప్రవర్తించిన సదరు వ్యక్తి.. విషయం బయటకు పొక్కడంతో సంధి మార్గాలను వెతుకుతున్నట్లు తెలిసింది. బస్తీవాసులు, స్థానికులు తెలిపిన ప్రకారం..ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సీఐబీ బస్తీలో అధికార పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి భవనం ఉంది. ఆ భవనంలోని పెంట్ హౌస్‌లో గత నెల 30న చదువుల కోసం అక్కా చెల్లెల్లు సోదరుడితో కలిసి అద్దెకు దిగారు.
మరుసటి రోజు అర్ధరాత్రి ఆమె సోదరుడు, సోదరి ఇద్దరు బయటకు వెళ్లారు. ఆ సమయంలో యువతి ఒంటరిగా ఉంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఆ ప్రబుద్ధుడు ఆమె గదిలోకి బలవంతంగా ప్రవేశించి తలుపులు వేసుకుని లైంగిక దాడికి యత్నించాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో పరారయ్యాడు. ఆ తర్వాత ఆమె జరిగిన విషయాన్ని సోదరుడు, సోదరికి చెప్పింది. బంధువులు, స్థానికులకు చెప్పడంతో అతడిని బస్తీకి పిలిపించి చెప్పులతో కొట్టి చితకబాదినట్లు తెలిసింది.
ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నమోదుకాగా, ఆ వీడియోలు స్థానికంగా వైరలయ్యాయి. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బాధిత బంధువులపై బాధ్యుడు ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. అదే బస్తీలో ఉండే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తేనే అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్లు తెలిసింది.
కాగా, అమ్మాయిపై అఘాయిత్యానికి యత్నించిన సదరు వ్యక్తి అధికార పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి అని స్థానికులు చెబుతున్నారు. నిందితుడిపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు అనేకం ఉన్నాయని, తాజాగా ఖైరతాబాద్‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 5 అంతస్తుల అక్రమ భవన నిర్మాణం కూడా చేపట్టినట్లు తెలిపారు. ఖైరతాబాద్ సీఐ వెంకట్ రెడ్డిని వివరణ కోరగా, తమకు బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, ఒక వేళ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.