సిటీ బ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో నగర ప్రజలు నరకయాతన పడుతున్నారు. మరమ్మతులకు నోచుకోని రోడ్లు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. చినుకుపడితే జలాశయాలను తలపించే రహదారులతో నిత్యం నరకం చూస్తున్నారు. వీటికితోడు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు, నీళ్ల బిల్లల మోత మోగిస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అన్ని విధాలుగా అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు.
ఆరు గ్యారెంటీలు, ఉచితాల పేరిట ఊదరగొట్టి నగర ప్రజలను తీవ్రంగా మోసం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా గ్రేటర్ ప్రజలకు కొత్త సమస్యలను తీసుకొస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. కేసీఆర్ హయాంలో జల మండలి ద్వారా 20 వేల లీటర్లదాకా ఉచితంగా మంచినీరు సరఫరా చేశారు. 20 వేల లీటర్లు దాటాక నామమాత్రపు బిల్లులతో బస్తీలు, కాలనీల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న రెండేండ్లలో వేలాదిగా నల్లా బిల్లులు వేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారు. ఇన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా కలిపి రూ.వేలల్లో బిల్లులు వచ్చినట్లు రసీదులు ఇస్తున్నారు. మొత్తం బిల్లులు చెల్లించాల్సిందేనని అధికారులు పేద ప్రజలకు హుకూం జారీ చేస్తున్నారు. దీంతో వేలాది రూపాయలు చెల్లించేదెలా? అంటూ బడుగు జీవులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రూ.వేలల్లో బిల్లులతో రసీదులు
కాంగ్రెస్ ప్రభుత్వం నగర ప్రజలపై నల్లా బిల్లుల మోత మోగిస్తున్నది. పరిమితికి మించి బిల్లుల పేరిట రసీదులు ఇస్తూ దినసరి కూలీలు, వేతన జీవుల నడ్డి విరుస్తున్నది. అధికారంలోకి వస్తే అన్నీ ఉచితంగా ఇస్తామని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను పీక్కు తింటున్నది. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో 20 వేల లీటర్ల వరకు మంచి నీటిని ఉచితంగా సరఫరా చేసిందని నగర ప్రజలు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఏడాది నుంచి ఇబ్బడిముబ్బడిగా బిల్లలను పెంచేసింది. మొదట్లో జీరో బిల్లు పేరిట రసీదులిచ్చి నగర ప్రజలను మభ్యపెట్టారు.
కానీ గత కొద్దిరోజులుగా జీరో బిల్లులు ఇచ్చిన వాటి స్థానంలో కూడా మొత్తం బిల్లులు ఒకేసారి కలిపి ఇంటింటికీ రూ.వేలల్లో బిల్లుల రసీదులను పంపిస్తూ నగర ప్రజలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.10 వేలదాకా బిల్లులతో రసీదులు అందజేస్తున్నారు. దీంతో ఒకేసారి అంత బిల్లు చెల్లించేదెలా? అంటూ పేద ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం.. ప్రజాపాలన అంటే పేద ప్రజలపై బిల్లుల భారం మోపడమేనా? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో మొత్తం మోసం, దగా జరుగుతున్నదని మండిపడుతున్నారు.
ఓట్లతో బుద్ధి చెబుతాం
నల్లా బిల్లుల పేరిట మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లతో బుద్ధి చెబుతామని నగర ప్రజలు ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులకు బాహాటంగానే చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు మంచినీరు, కరెంటు బిల్లులు సహా అనేక రకాల భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను మరోసారి ఓడగొట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తేల్చి చెబుతున్నారు. కాలనీలు, బస్తీల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులకు తమ బాధను వివరిస్తూ కాంగ్రెస్ మోసాలను చెప్పుకుంటున్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను అవస్థల పాలు చేస్తున్నారని వాపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచుతున్న కాంగ్రెస్‌ను కాలగర్భంలో కలిపేస్తామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, జలమండలి అధికారులు ఎన్ని రసీదులిచ్చినా బిల్లులు చెల్లించబోమని తెగేసి చెబుతున్నారు.
కాంగ్రెస్ వచ్చాక రెట్టింపైన నీళ్ల బిల్లు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. షేక్‌పేటలో మేముండే అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్లు ఉన్నాయి. గతంలో నెలకు రూ.5 వేల నల్లా బిల్లు వచ్చేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అది రెట్టింపు అయింది. ప్రస్తుతం నెలకు రూ.10 వేల బిల్లు వస్తున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో నగర ప్రజలను అన్నివిధాలా ఆదుకున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యాయి. కానీ కాంగ్రెస్ వచ్చిన రెండేండ్లలో ఒక్క హామీ అమలు చేయకపోగా పేద, మధ్య తరగతి ప్రజలపైన అదనపు భారం మోపుతున్నారు. అదనపు బిల్లులు వసూలు చేస్తున్న కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటుతో బుద్ధి చెప్తాం.
– మహ్మద్ మోహిద్ సిద్దిఖీ, షేక్‌పేట
బిల్లులు రావని చెప్పి మోసం చేశారు
నగర ప్రజలకు నీటి బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాగునీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసింది. గతంలో మాకు రూ.వెయ్యి బిల్లు వచ్చేది, ఇప్పుడు రూ.2 వేలకు పెరిగింది. పేద, మధ్య తరగతి ప్రజలకు నీటి బిల్లులు ఆర్థిక భారంగా మారాయి. గత ప్రభుత్వంలో బిల్లులు సాధారణంగా వచ్చేవి. ఇప్పటి బిల్లులను తట్టుకోలేకపోతున్నాం. మోసం చేసిన కాంగ్రెస్‌కు ఉపఎన్నికలో బుద్ధి చెబుతాం. కాంగ్రెస్‌ను ఓడించి మాకు చేస్తున్న అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాం.
– మహ్మద్ అక్బర్, షేక్‌పేట