సిటీబ్యూరో:దీపావళి నేపథ్యంలో గురువారం రాత్రి నగరంలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. ఒక్క మలక్పేటలోనే 335 ఏక్యూఐ పాయింట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం, వాటి నుంచి వెలువడిన పొగతో వాతావరణం కలుషితమైంది. ఫలితంగా గాలిలోని నాణ్యత స్థాయి ఒక్కసారిగా పడిపోయింది.
శుక్రవారం హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 171 పాయింట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం.. సోమాజిగూడ, న్యూమలక్పేట, సనత్నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కొంపల్లి, ఆబిడ్స్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో అధిక వాయు కాలుష్యం ఉంది. పీఎం 2.5 కాలుష్య వివరాల ప్రకారం.. పాశమైలారంలో ఏక్యూఐ 163 పాయింట్లు ఉండగా, యూఎస్ కాన్సులేట్ వద్ద 161, సోమాజిగూడలో 161, న్యూమలక్పేటలో 159 పాయింట్లు నమోదైంది.