సిటీబ్యూరో, నవంబర్ 3(నమస్తే తెలంగాణ)/చార్మినార్/ఆబిడ్స్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. దారుసలాంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి, ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ప్రస్తుతం ఏడు స్థానాల్లో ఎంఐఎ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, కొత్తగా మరో 2 స్థానాలైన రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. ఇందులో చాంద్రాయణ గుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, నాంపల్లి నుంచి మజీద్ హుస్సేన్, చార్మినార్ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్, యాకుత్‌పురా నుంచి జాఫర్ హుస్సేన్ మిరాజ్, మలక్‌పేట నుంచి అహ్మద్ బలాల, కార్వాన్ నుంచి కౌసర్ మొయినుద్దీన్‌లు బరిలో ఉంటారని తెలిపారు. ఇక బహదూర్‌పుర, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల అభ్యర్థుల్ని త్వరలోనే ప్రకటిస్తామని, ఒకటి రెండు రోజుల్లో ప్రచారం ప్రారంభిస్తామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. కాగా, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్ అహ్మద్ ఖాన్లు అభ్యర్థులుగా పోటీలో ఉండరని, వారిద్దరి సేవలు పార్టీకి ఉపయోగించుకుంటామన్నారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఎంఐఎం ఎప్పుడూ ముందుంటుందన్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీది అంతే ఉందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్కి అమ్మలాంటిది. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీలో ఉంది కాంగ్రెస్ సర్కారే. సెక్యూలరిజం అనే అబద్ధపు నినాదంతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. హిందుత్వ ఐడియాలజీలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. రామ మందిర ప్రారంభానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సైతం తీసుకువెళ్లాలని సూచించారు. ఇద్దరు ఒక్కటేనన్నారు. భారత్ జోడో అని రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ సచివాలయంలో ఉన్న మసీదును కూల్చారు. సీఎం కేసీఆర్ దాన్ని అర్థం చేసుకొని కొత్త సచివాలయంలో మసీదు నిర్మించారని అసదుద్దీన్ గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏకంగా 113 రోజులు కర్ఫ్యూ విధించారని, అదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌లో కర్ఫ్యూ అనే మాటకు చోటు ఇవ్వలేదు. ప్రధానంగా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా సమయంలోనే రెండు సార్లు మాత్రమే కర్ఫ్యూ విధించిన విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యేకంగా గుర్తు చేశారు. తెలంగాణలో శాంతి సామరస్యాలు ఉండాలంటే.. అది బీఆర్ఎస్ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని డిమాండు చేశారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారని, ఆయన హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నదని కలలు కంటురన్నారన్నారు. కాంగ్రెస్‌లో సీఎం నువ్వా..? నేనా..? అని కొట్లాడుతున్నారు. బండి సంజయ్ బీసీ కదా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు తొలగించారని? అలాంటి పరిస్థితుల్లో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఎలా నమ్మాలి? అని అసద్దుద్దీన్ ప్రశ్నించారు.