సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం క్యాడర్ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. తమ అధినాయకత్వం బీహార్‌లో వెళ్లి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఎంఐఎం కాంగ్రెస్‌కు వ్యతిరేకమా? అనుకూలమా? అనే విషయంలో స్పష్టత కరువయ్యిందంటూ మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు బీహార్‌లో ఎంఐఎం అధినాయకత్వంపై నోరు పారేసుకుంటున్నారు.
ఇక్కడేమో మీరే మాకు దిక్కంటూ ఎంఐఎం నాయకుల సహాయం కోరుతున్నారని.. దేశంలో కాంగ్రెస్‌ను ఖతం చేయాలంటూ బీహార్‌లో పార్టీ అధినాయకత్వం ప్రచారం చేస్తోంది. అదే ఇక్కడ కూడా వర్తిస్తోందనే భావనలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నట్లు జూబ్లీహిల్స్‌లో చర్చ జరుగుతుంది. హైదరాబాద్‌లో పట్టున్న ఎంఐఎం నాయకులు, గతంలోనూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో తమ ఓటు బ్యాంకును పక్కాగా కాపాడుకోవాలని ఎంఐఎం స్థానిక నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కుటుంబంపై రౌడీషీటర్ ముద్ర ఉండటంతో అది తమకు ఎక్కడ అంటుకుంటుందోనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. ఎంఐఎం నాయకులు నేరుగా ప్రచారంలోకి దిగకపోవడంతో తాము కూడా దూరంగా ఉండాలని పలువురు నాయకులు జూబ్లీహిల్స్‌లో చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను తమ వెంట పెట్టుకొని రోడ్ షోలు నిర్వహిస్తున్నాడని, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న జిమ్మిక్కులను తాము గమనిస్తున్నామని ఎంఐఎం నేతలు చర్చించుకుంటున్నారు.
ఇంటింటా మాగంటి…
జూబ్లీహిల్స్‌లో ప్రతి మైనారిటీకి మాగంటి గోపీనాథ్ చేరవేసిన పథకాలు దాదాపు ప్రతి ఇంటికి చేరాయి. ఆయన కుటుంబానికే జూబ్లీహిల్స్‌లోని ముస్లింలు మద్దతు తెలుపుతున్నారు. ఎంఐఎం పేరును వాడుకొని కాంగ్రెస్ బయటపడాలని చూస్తోందని, ఆ నాటకాలు తమకు తెలుసంటూ ఆ ఎంఐఎం నేతలు చర్చించుకుంటున్నారు. ఎంఐఎం పార్టీది దేశమంతా ఒకే విధమైన పాలసీ ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉంటుందనేది తమకు తెలుసంటూ బస్తీలు, కాలనీలలో చర్చ జరుగుతుంది. షాదీముబారక్, పెన్షన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేస్తుందని, కాంగ్రెస్‌ను నమ్మితే ముంచేస్తారని, ఇది 2023 ఎన్నికల్లో రుజువైందని అంటున్నారు.
ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు అయోమయాన్ని ఎదుర్కొంటున్నా జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ రావాల్సిందేననే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో మైనారిటీల ఓట్లన్నీ బీఆర్ఎస్కు ఏకపక్షం అయ్యే అవకాశాలుండటంతో కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెర లేపుతుందంటూ విమర్శిస్తున్నారు. తాము బీఆర్ఎస్ వెంట ఉన్నామని, తమను మభ్య పెట్టేందుకు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని, ఇదంతా జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్ అడుతున్న నాటకమని అర్థమవుతుందంటూ పలువురు ఎంఐఎం నాయకులు అంటున్నారు.
బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా..
జూబ్లీహిల్స్ అభివృద్ధి ఎవరి హయాంలో అయ్యిందో ముస్లింలందరికి తెలుసని మాట్లాడుకుంటున్నారు. బస్తీలు, కాలనీల్లో మాగంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆయన చేసిన అభివృద్ధే తప్ప, రెండేండ్లుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిందేనని ముస్లింలు నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది. ఎంఐఎం అయోమయ పరిస్థితులను కల్పించడంతో ఇక బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలువాలనే స్పష్టతలో ఉన్నట్లు సమాచారం.
ఎంఐఎం కేడర్ అంతా గప్‌చుప్‌గా ఉంది. పార్టీ అధినాయకత్వం బీహార్ ఎన్నికల బిజీలో ఉండటంతో పాటు బీహార్‌లో కాంగ్రెస్ నాయకులు ఎంఐఎం నేతలను విమర్శిస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో తిరుగుతున్నాయి. ఇక్కడ తమ పార్టీ నాయకుల సహాయం కోరుతూ, అక్కడ తమ పార్టీ అధినాయకులకు వ్యతిరేకంగా మాట్లాడటమేంటని.. ఇదెక్కడి ద్వంద్వ నీతి అంటూ కాంగ్రెస నాయకుల వైఖరిపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ వల్ల ఇక్కడ ఒరిగేదేమీ లేదని, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాల్సిందేనంటూ ముస్లింలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారని సమాచారం.
బీహార్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీకి మద్దతుగా ఎంఐఎం పనిచేస్తోందని బీహార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కుటుంబంపై రౌడీషీటర్ ముద్ర ఉండటంతో అది తమకు ఎక్కడ అంటుకుంటుందోనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. ఎంఐఎం నేతలు నేరుగా ప్రచారంలోకి దిగకపోవడంతో తాము కూడా దూరంగా ఉండాలని పలువురు నాయకులు జూబ్లీహిల్స్‌లో చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను తమ వెంట పెట్టుకొని రోడ్ షోలు నిర్వహిస్తున్నాడని విమర్శిస్తున్నారు.