 
                                                            సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ తరఫున ముస్లిం అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్‌ను ఓడించేందుకు పని చేసింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌కు ఉప ఎన్నిక రాగానే అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి పూనుకుంది. ఇది ఎంతవరకు సమంజసమంటూ కొందరు ముస్లిం సీనియర్ సిటిజన్స్ ఇటీవల జూబ్లీహిల్స్‌లో ఓ మసీదు వద్ద ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ప్రస్తుత ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతు ప్రకటించడంపై జూబ్లీహిల్స్‌లో ముస్లింలు అసదుద్దీన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నాడంటూ ఇప్పటికే బీజేపీ ప్రచారం చేస్తున్న విషయం విదితమే. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ముస్లిం మైనారిటీల నుంచి ఎదురయ్యే సూటి ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఎదురవుతున్న చేదు అనుభవాలను తప్పించుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. అదే బీఆర్ఎస్ హయంలో ముస్లిం నాయకులకు మంత్రివర్గంలో పెద్దపీట వేసి హైదరాబాద్ ప్రత్యేకతను చాటింది. ముస్లింల ఓట్ల కోసం అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో చోటిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం విడ్డూరంగా ఉం దని ఓటర్లు చర్చించుకుంటుండటం కొస మెరుపు.
ఆయనకు ఎందుకు మద్దతు ఇవ్వరు..!
అజారుద్దీన్ ఈ ఉప ఎన్నికలోనూ పోటీలో ఉండేందుకు టికెట్ కోసం విఫలయత్నం చేశాడు. అయితే ఆయనకు టికెట్ ఇప్పించడంలో ఎంఐఎం మద్దతు ఎందుకు తెలుపలేదు, ఆ పార్టీ తరఫున ఇక్కడి నుంచి మైనారిటీ నాయకుడిని నిలబెట్టి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదని అంటున్నారు. ఇప్పుడు మైనారిటీ నాయకుడికి టికెట్ రాకపోవడం, ఎంఐఎం పోటీలో లేకపోవడం, మైనారిటీయేతర నేతకు మద్దతు ప్రకటించాలంటూ ఎంఐఎం కోరుతుండటంపై పలువురు ముస్లింలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో అభివృద్ధికి అడ్డంకిగా మారిన కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో మరింత అధ్వాన పరిస్థితులు నెలకొంటాయని ఆయా వర్గాల ప్రజల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు హైదరాబాద్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిందని గుర్తు చేసుకుంటున్నారు. తమ ప్రాంతంతో పాటు నగరం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని.. రెండేండ్ల క్రితం చేసిన పొరపాటును మరోసారి చేయొద్దని, బీఆర్ఎస్తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉం టుందని ప్రజలు ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుకుంటుండటం బీఆర్ఎస్కు కలిసొచ్చే విషయమే.
గ్రేటర్‌పై చిన్నచూపు
హైదరాబాద్‌తో కలిపి మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలను కలుపుకొంటే సుమారు 2 కోట్ల జనాభా వరకు ఉంటారు. అలాంటిది హైదరాబాద్‌తో పాటు మిగతా రెండు జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై ప్రజలు కాంగ్రెస్‌పై మండిపడుతున్నారు. నగరంలో సగం ఎంఐఎం పార్టీకే పట్టుంటుంది. అ లాంటిది ఇక్కడి నుంచి ఒక్క మంత్రిని నియమించకపోవడం, మైనారిటీలకు స్థానం కల్పించకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో ఎక్కువగా ఉన్న ముస్లిం ఓటర్లు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎక్కడైనా ఎంఐఎం నాయకులు కన్పిస్తే చాలు గతంలో అజారుద్దీన్‌కు ఎందుకు మద్దతు ప్రకటించలేదనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
 
                            