Donald Trump | హిమాయత్ నగర్, ఫిబ్రవరి10: దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారిస్తున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలివుల్లా ఖాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర విమర్శించారు. ట్రంప్ భారతీయులపై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ లో ట్రంప్ ఫ్లెక్సీని దహనం చేశారు. చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్న పద్ధతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రంప్ నిర్ణయాల వల్ల భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భారత పౌరుల హక్కులను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 104 మంది భారతీయ పౌరులను అమెరికా నుంచి బహిష్కరించడాన్ని తాము త్రీవంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ముందు లొంగిపోయారని విమర్శించారు. గౌరవంగా పంపించకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయులను అవమానించడం సరైన విధానం కాదన్నారు. పెట్టుబడిదారీ రాజ్యానికి దేశ ప్రతిష్టతను మోదీ తాకట్టు పెట్టడం సిగ్గుచేటు అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అమెరికా అధికారులతో చర్చలు జరిపి భారతీయుల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్. శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమాన్, నగర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మహమూద్, ఉపాధ్యక్షుడు మాజీద్ అలీ ఖాన్, నేతలు కల్యాణ్, అనిల్ కుమార్, మధు, సంజయ్ కుమార్, సుమన్, గణేశ్, భానుప్రకాశ్, స్వామి, వేణు, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.