Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పూల్ సేవలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో గత మూడేళ్లుగా స్విమ్మింగ్ పూల్ సేవలను వినియోగంలోకి తీసుకురాలేదు. సుదీర్ఘ విరామం తరువాత స్విమ్మింగ్‌పూల్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దాంతో పాటు ఓయూ బ్యాడ్మింటన్ సింథటిక్ కోర్టులను సైతం ప్రారంభించనున్నారు. స్విమ్మింగ్ పూల్ యూజర్ చార్జీలను స్వల్పంగా పెంచుతూ అధికారులు నిర్ణయించారు. ఈ స్విమ్మింగ్ పూల్‌లో కోచింగ్ కూడా ఇవ్వనున్నారు. మూడు నెలల పాటు స్విమ్మింగ్‌పూల్ తెరిచి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
సాధారణ ప్రజలకు మొదటి నెలకు రూ.2,150, తరువాత నెల నుంచి రూ.2,000 చొప్పున వసూలు చేయనున్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు మొదటి నెల రూ.200, తరువాత నెల నుంచి రూ.100, అఫిలియేటెడ్ కళాశాలల విద్యార్థులకు మొదటి నెల రూ.850, తరువాతి నెల నుంచి రూ.700 చొప్పున వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఒక్కో బ్యాచ్‌కు నలభై నిమిషాల పాటు మొత్తం ఎనిమిది బ్యాచ్‌లకు ఈ సేవలు అందించనున్నారు. ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు, మధ్యాహ్నం మూడున్నర నుంచి అయిదున్నర గంటల వరకు తెరిచి ఉంటుంది. ఉదయం నాలుగు బ్యాచ్‌లు, సాయంత్రం మూడు బ్యాచ్‌లతో పాటు మహిళలకు ప్రత్యేకించి ఉదయం 9.20 నుంచి పది గంటలకు ప్రత్యేక బ్యాచ్ కొనసాగనుందని అధికారులు తెలిపారు.
మూడేళ్ల విరామం తరువాత స్విమ్మింగ్ పూల్ ప్రారంభిస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. అన్ని వేళలా కోచ్‌లను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి బ్యాచ్‌లో నలుగురు లైఫ్ గార్డ్స్‌ను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి ఒక్కరూ తాము నిర్దేశించుకున్న బ్యాచ్ సమయవేళలు పాటించాలి.
రాజేశ్‌కుమార్, ప్రొఫెసర్