సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో నగరానికి 24 గంటలూ తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. మెరుగైన సరఫరా కోసం సిటీకి అదనంగా 10 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎం.డి.దానకిశోర్ ఈ విషయాలను వెల్లడించారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరానికి అదనంగా మరో 10 టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌కు 24 గంటలూ తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు.. మురుగునీటి నుంచి హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దానకిశోర్ వివరించారు. జలమండలిలో నీటి సరఫరా, ఐటీ, ఎస్టీపీలు, ఇతర అన్ని విభాగాల్లో ఆధునిక సాంకేతికతను ఆమలు చేస్తున్నామన్నారు.
మరిన్ని ఉత్తమమైన సేవలందించేందుకు ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థలతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. దేశంలోనే అత్యుత్తమ సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఏకైక సంస్థ జలమండలి అని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా పలువురు కార్మికులకు 160 వాహనాలను త్వరలోనే అందించనున్నట్లు ఎండీ తెలిపారు. ఈ వేడుకల్లో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబు, సీజీఎం, అధికారులు
పాల్గొన్నారు.