మన్సూరాబాద్, సెప్టెంబర్ 30: అపహరణకు గురైన సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రాక్ చేసి గుర్తించిన ఎల్బీనగర్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతల నుంచి స్వాధీనం చేసుకున్న 90 సెల్ఫోన్లను బాధితులకు అందజేశారు. ఎల్బీనగర్లోని ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కృష్ణయ్య ఈ వివరాలను వెల్లడించారు. బస్టాపులు, కూరగాయల మార్కెట్లు, బస్సు ప్రయాణాల సమయంలో సెల్ఫోన్లు అపహరణకు గురైన ఘటనలపై బాధితులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసుల దర్యాప్తు చేపట్టారు. సంవత్సరం కిందట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ పోర్టల్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్)లో బాధితులు వివరాలను నమోదు చేశారు. పోర్టల్‌లో ఐఎంఈ నంబర్, ఫోన్ మోడల్, సెల్‌ఫోన్ పోయిన సమయంలో బాధితుడు వాడుతున్న సిమ్, ఫోన్ నంబర్‌ను కూడా అప్లోడ్ చేశారు. తస్కరించిన ఫోన్లను ఇతరులు వినియోగించుకునేందుకు అందులో సిమ్ వేయగానే.. ఆటోమెటిక్‌గా సదరు ఫోన్ బ్లాక్ అవుతుంది.
వెంటనే సదరు సమాచారం వెబ్సైట్ ద్వారా పోలీసులకు చేరుతుంది. ఈ సమాచారంతో సెల్ఫోన్లను వినియోగిస్తున్న వ్యక్తుల పూర్తి వివరాలు, చిరునామా తెలుస్తుంది. అపహరణకు గురైన సెల్ఫోన్లను వినియోగిస్తున్న వారంతా సామాన్యులే కావడం, గుర్తు తెలియని వ్యక్తులు తక్కువ ధరలో సెల్ఫోన్లు అమ్మడంతో కొని వినియోగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. చోరీ సమాచారాన్ని వారికి తెలిపి ఆ సెల్ఫోన్లను వారి నుంచి రికవరీ చేశారు. అపహరణ గురైన ఫోన్లను నగరంతో పాటు పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో వినియోగిస్తున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 90 సెల్ఫోన్లను ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్‌కుమార్, డీఎస్ఐ నరేందర్ పాల్గొన్నారు.