మేడ్చల్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీలు ఉత్తుత్తివేనా అంటూ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, శామీర్పేట, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 20 రోజుల కిందట జరిగిన తనిఖీలు చేసి హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. తనిఖీల్లో సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న దస్తావేజు లేఖరిలను అదుపులోకి తీసుకున్నారు.
సుమారు 20 మంది దస్తావేజు లేఖరిలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు దస్తావేజులపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవినితి ఫిర్యాదులు రావడంతోనే తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు మాత్రం విచారణ పేరిట జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తనిఖీలు జరిగి సుమారు 20 రోజులపైపనే అయినా ఇప్పటి వరకు అధికారులపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
దస్తావేజులు డ్యాకుమెంట్ రైటర్లతో నేరుగా సబ్ రిజిస్ట్రార్లు డిల్ చేస్తారన్న విషయం బహిరంగ రహస్యమే. ప్రతి దస్తావేజుకు డ్యాకుమెంట్ రైటర్లు రేటును ఫిక్స్ చేసి రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. ఏసీబీ అధికారుల తనిఖీల వల్లనైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి తగ్గుతుందని భావించినా.. చర్యలు మాత్రం తీసుకోవడంలో జాప్యంపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్పు వచ్చే అవకాశం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గజాల చొప్పున రిజిస్ట్రేషన్లకు రేటును ఫిక్స్ చేసి ప్రభుత్వ ఫీజుల చెల్లింపులతో రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి తడిసి మోపెడు అవుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. తనిఖీల్లో అనేక విషయాలు బయటకు వచ్చాయని తనిఖీల సమయంలో అధికారుల చెప్పిన మాటలకు ప్రస్తుతం జరుగుతున్న విచారణపై పొంతన లేకుండాపోయింది. ఏసీబీ అధికారుల విచారణ అనంతరం వివరాలను సబ్ రిజిస్ట్రార్ ఉన్నత కార్యాలయాలకు నివేదికను పంపించినట్లు చెబుతున్నారు. అయితే ఇంకా ఎన్ని రోజుల విచారణ పేరిట జాప్యం చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.