ఎర్రగడ్డ, మార్చి 4: బోరబండ బస్ టెర్మినల్ వద్ద ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలు మధ్య ఎప్పుడు చూసినా కనీసం 60 మంది కనిపిస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం టెర్మినల్‌లో గత రెండేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏసీ బస్ షెల్టర్‌ను (AC Bus Shelter) ఏర్పాటు చేయటం జరిగింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై కొందరి కన్ను పడింది. దాన్ని స్వాధీనం చేసుకుని పెద్ద మొత్తంలో కిరాయికి ఇవ్వటానికి భారీ ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా షెల్టర్ రూపు రేఖలు మార్చుతున్నారు. రాత్రికి రాత్రి ఏసీ బస్ షెల్టర్‌కు షట్టర్‌ను బిగించేశారు. నడి రోడ్డుపై సర్కారు ఆస్తిని కబ్జా చేస్తుంటే అడ్డుకునే నాథుడు కరువయ్యాడు.
నెలకు రూ.25 వేలు కిరాయి..
ఏసీ బస్ షెల్టర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న వ్యక్తులు.. సదరు షెల్టర్ రూపు రేఖలు మార్చి కిరాయికి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రేటు కూడా ఫిక్స్ చేశారు. అద్దెకు తీసుకోవాలనుకున్న వారు రూ. 5 లక్షలు అడ్వాన్స్.. నెలకు రూ. 25 వేలు కిరాయి ఇవ్వాలట. ఇప్పటికే ఇద్దరు ఈ రేటు ప్రకారం డబ్బులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. గతేడాది జులైలో బోరబండ ఏసీ బస్ షెల్టర్‌ను వందల మంది ప్రయాణికుల సమక్షంలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ప్రారంభించారు. కానీ.. ఆ మరుసటి రోజు నుంచి బస్ షెల్టర్ తలుపులకు తాళాలు దర్శనమిచ్చాయి. ఏసీ బస్ షెల్టర్‌ను ఏర్పాటు చేసిన తర్వాత చాలా రోజులకు ప్రారంభింపజేయటం.. ఆ మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు షెల్టర్‌కు తాళాలు వేయటం.. తాజాగా షట్టర్‌ను భిగించటం.. ఇవన్నీ గమనిస్తే పలు అనుమానాలకు తావిస్తున్నదని స్థానికులు పేర్కొంటున్నారు.