Suicide | మారేడ్‌పల్లి, జూలై 17 : అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహారాజ్ గంజ్ (25-30) జీవనోపాధి నిమిత్తం సంవత్సరం క్రితం బాచుపల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన మహారాజ్ గంజ్ పనికి వెళ్లకుండా పలువురు వద్ద తన అవసరం నిమిత్తం డబ్బులను అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించడం లేదు. జీవితంపై విరక్తి చెందిన మహారాజ్ గంజ్ గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నెంబర్ ఒకట్లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.