North City Metro | సిటీబ్యూరో, జనవరి 19(నమస్తే తెలంగాణ) : నార్త్ సిటీలో కీలకమైన ప్యారడైజ్-మేడ్చల్ మార్గంలో మార్పులపై మెట్రో దృష్టి పెట్టింది. బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా మెట్రో లైన్ తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇంజినీరింగ్ సాంకేతిక ఇబ్బందులు దృష్ట్యా… ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు ప్యారడైజ్ నుంచి మెట్రో ప్రారంభమవుతుందని భావించినా… అలైన్మెంట్ మార్పులతో ఆ కల కనుమరుగు కానున్నది. అయితే జేబీఎస్ ప్రధాన వై జంక్షన్‌గా మారనుండగా జేబీఎస్ వద్ద రెండుగా చీలి ఒకటి మేడ్చల్ వైపు, మరోకటి శామీర్‌పేట వైపు పయనించనున్నది. ఈ మార్గంలో ఇరుకైన రోడ్లు, బేగంపేట ఎయిర్‌పోర్టు మెట్రో మార్గానికి ప్రధాన ఆటంకాలుగా మారుతుండగా… సాధ్యాసాధ్యాలపై మెట్రో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆదివారం ఈ మార్గంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఇంజినీరింగ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ మార్గంలో మెట్రో నిర్మాణం సాధ్యం కాదని, అందుకే నేరుగా జేబీఎస్ కేంద్రంగా మెట్రోను నిర్మించడమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని తేల్చింది.
అడ్డంకులెన్నో…
స్వల్ప మార్పులతో నార్త్ సిటీ మెట్రో మార్గానికి రూపొందించేందుకు హైదరాబాద్ మెట్రో సంస్థ సన్నాహాలు చేస్తోంది. ప్యారడైజ్-మేడ్చల్(23కి.మీ), జేబీఎస్-శామీర్‌పేట(22కి.మీ) మార్గంలో మెట్రో అలైన్మెంట్ ప్రతిపాదించారు. అయితే ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వెళ్లే మార్గంలో బేగంపేట ఎయిర్‌పోర్టు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ప్యారడైజ్ వద్ద మెట్రో స్టేషన్ కంటే… జేబీఎస్ వద్ద మెట్రో జంక్షన్ ఏర్పాటు చేస్తే సరిపోతుందని మెట్రో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషణలో భాగంగా ప్యారడైజ్ నుంచి తొలగించే అవకాశం ఉంది. వాస్తవానికి ప్యారడైజ్ నుంచి మొదలై, బేగంపేట ఎయిర్‌పోర్టు మీదుగా బోయిన్పల్లి వరకు రోడ్డు వంకలు తిరిగి ఉండటం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షల నేపథ్యంతో ఈ మార్గంలోనే మెట్రో నిర్మాణం సాధ్యం కాదని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును బేగంపేట ఎయిర్‌పోర్టు ఇబ్బందులతో అండర్ గ్రౌండ్ టన్నెల్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఎయిర్‌పోర్టు మీదుగా మెట్రో అసాధ్యమని భావించారు. ఈ క్రమంలో అండర్ గ్రౌండ్ నుంచి ఎలివేటెడ్ ప్రాజెక్టుగా చేపట్టడం అత్యంత క్లిష్టమని భావించిన మెట్రో సంస్థ… అందుకు జేబీఎస్ నుంచి మెట్రో ప్రారంభించడంపై అధ్యయనం చేస్తున్నది.
మారనున్న అలైన్మెంట్…
జేబీఎస్ నుంచి ప్రారంభించి సికింద్రాబాద్ క్లబ్ రోడ్డు, స్టాఫ్ రోడ్డు, మడ్‌ఫోర్ట్ రోడ్డు, టీవోలీ జంక్షన్ రోడ్డు, డైమండ్ పాయింట్ జంక్షన్, సెంటర్ పాయింట్ జంక్షన్, హస్మత్‌పేట్ జంక్షన్ బోయిన్పల్లి రోడ్డు, తాడ్‌బండ్ హనుమాన్ టెంపుల్ రోడ్డు, ఎయిర్‌పోర్టు ఆఫీస్ జంక్షన్, బోయిన్పల్లి చెక్‌పోస్టు, మీదుగా సుచిత్ర మార్గంలో ఉండే జాతీయ రహదారి జంక్షన్ వద్ద అలైన్‌మెంట్‌ను అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే విస్తరించిన జాతీయ రహదారికి అడ్డం లేకుండా ఎన్‌హెచ్ సర్వీస్ లేన్‌పై మెట్రో స్తంభాలు, వయడక్టును నిర్మించడం ఉత్తమమని చెబుతున్నారు. ఇలా మార్చడం వల్ల బేగంపేట ఎయిర్‌పోర్టుకు దూరంగా మెట్రోకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మేడ్చల్ వరకు తీసుకెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నారు.
వై జంక్షన్‌గా జేబీఎస్…
ప్రస్తుతం జేబీఎస్ ఇన్ గేట్ వద్ద మెట్రో లైన్ నిలిచిపోయింది. ఇక్కడి నుంచి డబుల్ డెక్కర్ నిర్మాణం చేపట్టి… నేరుగా సికింద్రాబాద్ క్లబ్ రోడ్డు మీదుగా నేరుగా శామీర్‌పేట మెట్రో లైన్‌ను, హెచ్ఎండీఏ నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌తో అనుసంధానం చేయనున్నారు. అయితే నార్త్ సిటీ మెట్రో నిర్మాణంలో… భవిష్యత్‌లో జేబీఎస్ మెట్రో వై జంక్షన్ కీలకం కానున్నది. ఒక చీలిక మేడ్చల్ వైపు, మరో చీలిక శామీర్‌పేట వరకు పయనించనున్నది. దీనికి కనీసం 30 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. జేబీఎస్ వద్ద రక్షణ, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భూ సమీకరణ సులభతరం కానున్నది.