ఒకప్పుడు సైకిళ్లను ఎక్కువగా వాడేవారు.. అందువల్ల వారు ఆరోగ్యంగా ఉండేవారు. ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నా.. వ్యాయామం చేయడంలో ఇప్పటికీ వెనకబడే ఉన్నారు. అలాంటప్పుడు సైక్లింగ్‌ను ఎంచుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం..పైగా పర్యావరణ పరిరక్షణకు కూడా పాటుపడినవారవుతారు. సైక్లింగ్ ప్రాధాన్యతను చాటేందుకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో సైకిల్‌పై ఉద్యోగాలకు వెళ్లొచ్చే వారిని గుర్తించి సత్కరిస్తున్నది. ‘సైకిల్ తొక్కు.. ఫిట్‌గా ఉండు’ కాన్సెప్ట్‌తో నగరంలో సైక్లింగ్‌కు ప్రోత్సాహం అందించేలా హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ (హెచ్‌సీజీ) ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నది.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ)
మియాపూర్‌లో కున్ హ్యుందాయ్ కంపెనీ ఉద్యోగి జనార్దన్ సైకిల్‌పైనే కార్యాలయానికి వెళ్తుంటారు. సైక్లింగ్‌లో ఆయన చూపుతున్న చొరవను గుర్తించిన హెచ్‌సీజీ లోగో అవార్డుతో సత్కరించింది. అలాగే కెనరా బ్యాంక్‌లో పనిచేస్తున్న ఉమామహేశ్, ఎంటీఏఆర్ మేనేజర్ శ్రీధర్, యూఎక్స్ ఇంజినీర్ నవదీప్, మార్వెల్ ఉద్యోగి ఆకాశ్ తదితరులను సైతం హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ సభ్యులు వారి కార్యాలయాలకు వెళ్లి సన్మానించారు. హైదరాబాద్‌లో హెచ్‌సీజీ చొరవను సోషల్ మీడియాలో చూసిన చెన్నైలోని ఓ ఐటీ సంస్థ తమ వద్ద కూడా సైక్లింగ్ చేసే వారున్నారని, తమనూ సత్కరించాలని కోరడంతో స్పందించిన హెచ్‌సీజీ.. అక్కడి వారిని కూడా సన్మానించింది. సైకిల్‌పై ఉద్యోగాలకు వెళ్తున్న వారి వివరాలు తెలియజేస్తే ప్రోత్సహించేందుకు సత్కార కార్యక్రమాలు చేపడతామని సంస్థ వెల్లడించింది.
ఉద్యోగాలకు సైకిల్‌పై వెళ్లడం గొప్ప విషయం. చాలా మంది ఉద్యోగులు వాహనాలను పక్కనపెట్టి సైకిల్‌పైనే వెళ్తున్నారు. అలాంటి వారిని గుర్తించి.. ‘ఐ లవ్ సైక్లింగ్’ లోగోలతో చేయించిన అవార్డ్స్, శాలువాలతో సత్కరిస్తున్నాం. తమ వాహనాలను వినియోగించకుండా పర్యావరణానికి కాలుష్య ముప్పు కట్టడికి సైకిల్ వినియోగిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
-రవీందర్ నందనూరి, వ్యవస్థాపకుడు, హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్