ఎల్బీనగర్, నవంబర్ 13 : రోడ్డు ప్రమాదంలో(Road accident) విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్మాన్‌ఘాట్ న్యూ మారుతీనగర్‌కు చెందిన గుబ్బల లోకేష్ కూతురు గుబ్బల త్రిష (20) నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ కాలేజీలో డిప్లోమా మూడో సంవత్సరం చదువుతున్నది. బుధవారం ఉదయం గుబ్బల త్రిష కాలేజీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది.
కర్మాన్‌ఘాట్ మంద మల్లమ్మ ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డును దాటుతుండగా.. వేగంగా వచ్చిన రాయల్ ఎన్ఫీల్ట్ బైక్ వెనుక నుంచి ఢీ కొట్టడంతో త్రిష అక్కడికక్కడే మరణించింది (Student died). సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. త్రిష మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.