Hyderabad | ఖైరతాబాద్, సెప్టెంబర్ 7 : నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో రోడ్లపై పూలు, పూజా వ్యర్థాలు పెద్ద ఎత్తున పడ్డాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. అయితే విధి నిర్వహణలో ఉన్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని టస్కర్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక (50) గత 15 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్లో ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆదివారం ఉదయం బషీర్‌బాగ్‌కు విధుల కోసం వచ్చింది. బషీర్‌బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే దారిలో పెద్ద ఎత్తున టస్కర్, ట్రాలీలు, భారీ వాహనాలపై శోభాయాత్రలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డివైడర్ దాటి రోడ్డు వైపునకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు టస్కర్ చక్రాల కింద పడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టస్కర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంపై మేయర్, కమిషనర్ ఆరా
కాగా, జీహెచ్ఎంసీ కార్మికురాలు రేణుక మృతిపై నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్నన్ ఆరా తీశారు. ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రేణుక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.