అంబర్‌పేట, జనవరి 9: అంబర్‌పేట నియోజకవర్గంలో మన బస్తీ-మన బడి పనులు ఎంత వరకు వచ్చాయనే అంశంపై సోమవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ‘మనబస్తీ-మనబడి’కి ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎంపికైన ఏడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ ఈవో విజయలక్ష్మి, డిప్యూటీ ఐఓఎస్ ఇక్బాల్ లతో ఆయన మన బస్తీ మన బడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ స్కీమ్ కింద ఎంపికైన పాఠశాలలో అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నది. ఇందులో భాగంగా పాఠశాలకు రంగులు వేయడం, విద్యార్థులు కూర్చోవడానికి కావాల్సిన బల్లలు, బెంచీలు, ఉపాధ్యాయులకు కుర్చీలు, బోర్డులు, ఆ స్కూల్‌కు బోరు వేయించడం, టాయిలెట్లు కట్టించడం, మరమ్మతులు చేయించడం వంటి సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.
అంబర్‌పేట మండలంలో ఏడు పాఠశాలలు మన బస్తీ-మన బడి కింద ఎంపికయ్యాయి. వాటిలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఒకటి, రెండు పాఠశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో ఇంకా చేపట్టవలసిన పనులు, కల్పించాల్సిన సౌకర్యాలపై ఎమ్మెల్యే పాఠశాలల హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు. కొందరు తమ పాఠశాలల్లో టాయిలెట్ల సౌకర్యం కల్పించాలన్నారు. అయితే ఇంకా చేయాల్సిన పనులపై ఒక జాబితాను తయారు చేసి ఇస్తే తాను వెంటనే ఆ పనులు చేయిస్తానని చెప్పారు.
భాగ్యనగర్ బస్తీ అభివృద్ధికి కృషి
నల్లకుంట డివిజన్ భాగ్యనగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. సోమవారం వాటర్‌వర్క్స్ అధికారులతో కలిసి భాగ్యనగర్‌లో ఆయన పర్యటించారు. బస్తీలో డ్రైనేజీ పొంగిపొర్లుతుండటాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. బస్తీలో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
‘మన బస్తీ-మన బడి’ పై 11న జిల్లాస్థాయి సమీక్ష..
అంబర్‌పేట, జనవరి 9: అంబర్‌పేట నియోజకవర్గం కాచిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 11వ తేదీ బుధవారం మన బస్తీ-మన బడి పై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం ఉంటుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, హైదరాబాద్ జిల్లా డీఈవో రోహిణి తదితరులు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో జిల్లాస్థాయిలో ఎంపికైన మన బస్తీ-మన బడి పనుల పురోగతి, ఇంకా చేపట్టాల్సిన పనులపై చర్చించడం జరుగుతుందన్నారు.