మెహిదీపట్నం ఏప్రిల్ 28 : పోలీసుల తనిఖీలను తప్పించుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడి యువకుడికి గాయాలైన సంఘటన హుమాయం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ లో చోటుచేసుకుంది. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ అహ్మద్ నగర్‌లోని ఫస్ట్ లాన్సర్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కూకట్పల్లి ప్రాంతానికి చెందిన సాజిద్ ఖాన్ తన ద్విచక్రవాహనంపై అటువైపుగా వచ్చాడు. అకస్మాత్తుగా పోలీసుల తనిఖీలను గమనించిన సాజిద్.. పోలీసుల నుంచి తప్పించుకుని వెళ్లాడు. ఈ క్రమంలో వేగంగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నంచేయగా.. ప్రమాదవశాత్తూ బైక్‌పై కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో సాజిద్ ముక్కుకు గాయమైంది. ఈ ఘటనపై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌కు సాజిద్ ఫిర్యాదు చేశాడు.
దీంతో మరుసటి రోజు ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఆస్పత్రికి వెళ్లి సాజిద్‌ను పరామర్శించాడు. అయితే పోలీసులు తనపై దాడి చేశారని ఎమ్మెల్యేకు సాజిద్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే హుమాయూన్ నగర్ ఇన్స్పెక్టర్ మల్లేశ్‌కు ఫోన్ చేసి వివరణ కోరారు. అయితే సాజిద్ మాటల్లో నిజం లేదని.. తమ నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడని ఇన్స్పెక్టర్ చెప్పారు. ఇదే ఘటనపై యూట్యూబ్‌లోనూ అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.